టీటీడీని ఐదేళ్ల పాటు భ్రష్టుపట్టించిన రక్షణ శాఖ మాజీ ఉద్యోగి ధర్మారెడ్డి ఎక్కడ అని .. పవన్ కల్యాణ్ దగ్గర నుంచి సామాన్య భక్తుడు కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన మాత్రం బయటకు వచ్చి.. తన హయాంలో అంతా శ్రీవారి లడ్డూతయారీకి ఉపయోగించిన నెయ్యి అంత స్వచ్చంగా టీటీడీలో వ్యవహారాలు నడిచాయని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. సర్వీసులో ఉన్నారు కాబట్టి నోరెత్తలేకపోతున్నారని చెప్పడానికి కూడా లేదు. ఆయన రిటైరైపోయారు. మరి ఇప్పుడు ఎందుకు నోరెత్తడంలేదు ?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి బంధువు అయిన ధర్మారెడ్డి వైఎస్ సీఎం అయినప్పుడే టీటీడీ జేఈవోగా రక్షణ శాఖ నుంచి దిగుమతి అయ్యారు. అప్పట్లో ఆయన వ్యవహారాలు వివాదాస్పదం కావడంతో … వైఎస్ కూడా భరించలేక టీటీడీ నుంచి తప్పించారు. తర్వాత మళ్లీ రక్షణ శాఖ కు వెళ్లారు. మళ్లీ జగన్ వచ్చాక.. తిరుమల కొండపై కాలు మోపారు. అర్హత లేకపోయినా ఈవోగా ఉన్నారు. ఐదేళ్ల పాటు కొండపై ఆయనదే రాజ్యం. శ్రీవారిని లాబీయింగ్ కోసం ఆయన వాడుకున్నట్లుగా ఇంకెవరూ వాడుకోలేదు.
ఇప్పుడు టీటీడీ వ్యవహారాల్లో విజిలెన్స్ దర్యాప్తు జరుగుతున్నా నోటీసులకు స్పందించడం లేదు. కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం అవుతున్నా బయటకు రావడం లేదు. ఆయన ఎక్కడకు వెళ్లారు.. ఎందుకు స్పందించడం లేదు అన్నది మాత్రం రాజకీయవర్గాల్లోనూ హాట్ టాపిక్ గా ఉంది. సమర్థించుకునే దారి లేక తాను మాట్లాడితే.. ఇంకా నాలుగు విషయాలు బయటకు వస్తాయన్న భయంతో ఆయన సైలెంట్ గా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.