‘ఎంతవారలైనా కాంత దాసులే’ అనే నానుడి తెలిసిందే కదా. ఇది మగవారిని ఉద్దేశించి చెప్పారు. అయితే రాజకీయాల్లో కాంతలైనా, పురుషులైనా పదవులకు దాసులు. పదవి లేకపోతే పెదవి విప్పరు. పదవి ఉంటేనే ప్రజల్లోకి వస్తారు. పదవి ఉంటేనే చురుగ్గా ఉంటారు. పదవి లేకపోతే ఎవ్వరికీ కనబడకుండా ఎక్కడో ఉండిపోతారు. ఇందుకు ఛోటా నాయకులే కాదు, మోటా (లావుగా ఉన్నవారు కాదండి, పెద్ద నాయకులు) నేతలు కూడా మినహాయింపు కాదు. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతానమూ అంతే. సీఎం గారాలపట్టి, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఎక్కడ? ఇదిప్పుడు అందరినీ తొలిచేస్తున్న కీలక ప్రశ్న. ఇందుకు సరైన సమాధానం టీఆర్ఎస్ నేతల దగ్గరా లేదు.
కవిత రాష్ట్రం వదిలో, దేశం వదిలో వెళ్లిపోలేదు. కాని మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న కీలక సమయంలో ఆమె సైలెంటుగా ఉండిపోయింది. నిజానికి ఆమె ఇప్పటికిప్పుడు సైలెంటుగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి నిశ్శబ్దంగానే ఉంది. ఎంపీగా ఉన్నప్పుడు అదే పనిగా మాట్లాడిన కవిత ఓడిపోయాక మాట్లాడటంలేదు. అంటే పదవి లేకపోతే ప్రజలతో తనకు పని లేనట్లుగానే ఈమె భావిస్తున్నదేమో…! ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లు టీఆర్ఎస్కు కీలకమైనవి. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు బీజేపీ చేతిలో ఉన్నాయి.
నిజామాబాద్‌లో కవితను ఓడించింది బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇతను టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడనే సంగతి తెలిసిందే. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ రెండు కార్పొరేషన్లు టీఆర్ఎస్ దక్కించుకునేలా కవిత ప్రచారం చేస్తుందని భావించారు. కాని ఇప్పటివరకు ఈ రెండు చోట్లా ప్రచారం చేస్తానని ఆమె చెప్పలేదు. అమెరికా వెళ్లి జనవరి మొదటి వారంలో తిరిగొచ్చిన కవిత సైలెంటుగానే ఉంది. లోక్‌సభ ఎన్నికల తరువాత రెండు మూడు సందర్భాల్లో తప్ప ఆమె జనంలోకి రాలేదు. ఆమె ప్రముఖంగా కనిపిందచింది లష్కర్ మహంకాళి బోనాల సమయంలో, బతుకమ్మ పండుగ సమయంలో.
మున్సిపల్ ఎన్నికల సమయంలో కవిత రంగంలోకి దిగి రాష్ట్రమంతా ప్రచారం చేస్తుందని, స్టార్ కేంపెయినర్‌గా ఉంటుందని అనుకున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ మాజీ ఎంపీ కాబట్టి అక్కడ కీలకంగా పనిచేస్తుందని, ఆ కార్పొరేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ధర్మపురి అరవింద్ పట్ల ప్రజా వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. ఆయన తన ఎన్నికల హామీ అయిన పసుపు బోర్డు ఏర్పాటు చేయించలేదని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. పసుపు బోర్డుకు బదులుగా అంతకంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయనుకోండి. అది వేరే విషయం.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కవిత లేకపోవడం తమకు పెద్ద లోటుగా ఉందని టీఆర్ఎస్ నాయకులు మీడియాకు చెప్పుకొని బాధపడుతున్నారు. కవిత యాక్టివ్ అవుతున్నట్లు కొన్నాళ్ల కిందట వార్తలొచ్చాయి. ఆమె మున్సిపల్ ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని కథనాలొచ్చాయి. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ఎంతటి మాటకారులో కవిత కూడా అంతే. ఇలాంటి చురుకైన మహిళ డల్‌గా ఉండకూడదు కదా. అందుకే మళ్లీ యాక్టివ్ రోల్ పోషించడానికి సిద్ధమవుతోందని నాయకులు చెప్పారు.
కాని అలాంటి వాతావరణం కనబడటంలేదు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు, ఆరు మున్సిపాలిటీలున్నాయి. వీటిని కైవసం చేసుకోవాలంటే కవిత రంగంలోకి దిగాల్సిందే అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. సో…కవిత అవసరం ఇప్పుడు చాలా ఉంది. కవిత చురుగ్గా లేకపోవడం వల్ల నిజామాబాద్ జిల్లాలో పార్టీ కేడర్ డీలా పడిందని నాయకులు దిగులు పడుతున్నారు. అక్కడ బలమైన నేత లేకపోతే ఎలాంటి పరిణామాలైన సంభవించవచ్చని అంటున్నారు.