కరోనా కోరల్లో చిక్కుకుంటున్న తెలంగాణ ప్రజలు.. ప్రభుత్వం వైపు చూస్తున్నారు. లక్షణాలు కనిపిస్తున్న వారు టెస్టులు చేయించుకోవడానికి .. పాజిటివ్ వచ్చిన వారు వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి చిన్నపాటి కదలిక కూడా కనిపించడం లేదు. పదిహేను వందల పడకలతో టిమ్స్ ఆస్పత్రి రెడీ అని చెప్పి రెండు, మూడు నెలలు అవుతోంది కానీ అందుబాటులోకి రాలేదు. ఏ ఆస్పత్రిలో కూడా బెడ్స్ ఖాళీ లేవు. చివరికి జర్నలిస్టుల కోసం నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని మీడియా ప్రతినిధుల్ని మంచిచేసుకునే ప్రయత్నం చేసారు కానీ.. అక్కడా జర్నలిస్టులకు కూడా.. బెడ్స్ దొరకని పరిస్థితి. పెద్ద ఎత్తున జర్నలిస్టులు కూడా.. కరోనా బారినపడ్డారు. వారికి చికిత్స అందడం గగనం అవుతోంది. పలుకుబడి ఉన్న జర్నలిస్టులు… ప్రభుత్వంలోని పెద్దలకు చెప్పించి ఎక్కడో చోట చికిత్సకు అవకాశం పొందుతున్నారు కానీ.. మిగతా వాళ్లకు అదీ కూడా లేదు.
ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులు కూడా ప్రారంభమయ్యాయి. అవి కోవిడ్ లక్షణాలే కావడంతో.. ప్రజలందరిలోనూ భయం ప్రారంభమయింది. హైదరాబాద్‌లో ఇప్పుడు కరోనా కేసులు లేని కాలనీ లేదు. అన్ని చోట్లా.. ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకునే పరిస్థితి లేదు. పాజిటివ్ వచ్చింది అని చెప్పి.. హోం ఐసోలేషన్‌లోనే ఉండమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏవో టాబ్లెట్లు సజెస్ట్ చేసి.. సైలెంటవుతున్నారు. ఈ పరిణామాలన్నీ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
మరో వైపు ప్రభుత్వం తరపున కదలికే ఉండటం లేదు. గాంధీ ఆస్పత్రిలో వెయ్యి బెడ్లు ఖాళీగా ఉన్నాయని.. అధికారులు ప్రకటిస్తూంటారు.. కానీ ఒక్కరినీ చేర్చుకోరు. ఇత ఆస్పత్రుల్లోన అదే పరిస్థితి. గతంలో కనీసం.. ప్రభుత్వం సమీక్ష చేసి.. ఏం చేయబోతున్నామో.. ఎలా చేయబోతున్నామో కూడా చెప్పేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు. ప్రగతి భవన్లో 30కిపైగా కరోనా కేసులు బయటపడటంతో.. ఆయన ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో విపక్షాలు మరింతగా విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే.. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కేసీఆర్ … ఒక్క సారిగా సడన్ నిర్ణయం తీసుకుని అందరితో శభాష్ అనిపించుకుటారు. ఈ సారి కూడా.. అసంతృప్తి.. కోపం.. పీక్స్‌కి వెళ్లిన తర్వాత అలాంటిదేమైనా చేస్తారేమో కానీ.. ప్రస్తుతం ప్రజలు మాత్రం.. వెరీజ్ కేసీఆర్ అనే నినాదాన్ని ఇంటా బయటా వినిపిస్తున్నారు.