గత నెల పదో తారీఖు తెల్లవారు జామున హైదరాబాద్ లో మంత్రి నారాయణ కుమారుడు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. బెంజ్ కారులో, మితిమీరిన వేగంతో దూసుకు పోవడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బెంజ్ కారు భద్రతపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అత్యాధునిక సదుపాయాలున్న వాహనంలో భద్రత సరిగా ఉందా లేదా అనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బెంజ్ సంస్థ కూడా ప్రమాద స్థలికి రావడం, పరిశీలించడం కూడా జరిగాయి. అయితే, ఇప్పుడు బెంజ్ కంపెనీ ఓ వితండ వాదన వినిపిస్తోందని పోలీసులు వాపోతున్నారు!
పోలీసులు కోరినట్టుగా ప్రమాదానికి కారణమైన కారుకు సంబంధించిన వివరాలను బెంజ్ కంపెనీ ఇచ్చేందుకే ఓ మెలిక పెట్టింది. సీటు బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తేనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుంటాయా.. బెల్ట్ పెట్టుకోక పోతే అవి పనిచెయ్యవా అనే అంశాన్ని ప్రశ్నిస్తూ పోలీసులు బెంజ్ కంపెనీకి లేఖ రాశారు. కారు భద్రతా వివరాలను కోరారు. గత నెల 16నే ఈ ప్రమాదంపై బెంజ్ కంపెనీ కూడా విచారణ చేపట్టింది. అయితే, తాజా ట్విస్ట్ ఏంటంటే.. ప్రమాదానికి గురైన బెంజ్ కారుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటే.. కేసు దర్యాప్తు వివరాలతోపాటు, పోస్ట్ మార్టం రిపోర్టులను కూడా తమకు ఇవ్వాల్సి ఉంటుందని మెలిక పెట్టింది. దీంతో పోలీసులు షాక్ తినాల్సి వచ్చింది! ఈ కేసుకు సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచుతున్నామనీ, వాటిని ఆ కంపెనీకి ఎలా ఇస్తామనే అభిప్రాయం పోలీసుల నుంచి వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై కొంతమంది ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారట!
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం! ఇంతకీ, మంత్రి నారాయణ కుమారుడు మరణం కేసు దర్యాప్తు ఏ దిశగా సాగుతోందంటే… కారు కాపాడలేకపోయింది కాబట్టే, ప్రమాదం జరిగింది అనే నిరూపించే పనిలో ఉన్నట్టు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. తప్పంతా ఆ బెంజ్ కారుదే, లోపాలన్నీ దాన్లోనే ఉన్నాయనే రూఢి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ కేసు విషయంలోనే ‘వాహన నాణ్యత – భద్రత’ అనే అంశాలపై చర్చ ఎందుకొస్తోంది..? మిగతా ప్రమాదాల విషయంలో ఈ యాంగిల్ లో.. మరీ ఈ స్థాయిలో దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు..?
మొన్నటికి మొన్న.. నటుడు రవితేజ సోదరుడు భరత్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. ఆయన కారులో మందు బాటిల్ దొరికింది. ప్రమాదానికి గురైన తరువాత భరత్ మృత దేహం రాత్రంతా ఆసుపత్రిలోనే ఉండిపోయింది. నిషిత్ విషయంలో మాత్రం… ప్రైవేటు ఆసుపత్రిలోనే పంచనామా త్వరత్వరగా జరిగిపోయింది. తాజాగా శిరీష కేసు విషయంలోనూ అదే ఇంతే! ఆమె మరణించడానికి ముందు ఎవరితో మాట్లాడిందీ.. ఎలాంటి దుస్తులు వేసుకుందీ… గదిలో ఏం జరిగింది.. ఇలా మినట్ టు మినిట్ అంతా మీడియాలో వచ్చింది. కానీ, నిషిత్ విషయంలో ఎందుకీ సమాచారం బయటకి రాలేదు. ప్రమాదానికి గురైన ఆ రాత్రి నిషిత్ ఎలా ఉన్నాడు..? ఏ పరిస్థితుల్లో కారు డ్రైవ్ చేశాడు..? అంతవేగంగా కారు డ్రైవ్ చేయాల్సిన అర్జెన్సీ ఏంటీ..? ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వినిపించవు..?
తప్పంతా బెంజ్ కారుదో.. రోడ్డుకి అడ్డంగా బలంగా నిలబడి ఉన్న మెట్రో పిల్లర్ దో అన్నట్టుగా విచారణ సాగుతున్నట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి. మంత్రి కొడుకైనా, మరొకరైనా మరణానికి మించిన కష్టం మరొకటి లేదు. ఇలాంటి ప్రమాదాలపై అందరికీ సానుభూతి ఉంటుంది. కానీ, ఒక్కో కేసులో ఒక్కోలా దర్యాప్తులు జరుగుతూ ఉండటమే ఈ చర్చకు తావిస్తోంది.