వివాదాస్పద స్వామి నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమిళ మీడియా ఈ మేరకు ఖచ్చితంగా కని కథనాలను ప్రసారం చేస్తోంది. నిత్యానంద స్వామి రెగ్యులర్ గా యూట్యూబ్ వీడియోలతో టచ్ లో ఉంటారు. కానీ గత శివరాత్రి నుంచి ఆయన కనిపించడం లేదు. దీంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి. గతంలోనూ ఆయన ఓ సారి చావుబతుకుల నుంచి బయటకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది.
దేశంలో హాట్ టాపిక్ అయిన స్వామిజీల్లో నిత్యానంద ఒకరు. సోషల్ మీడియాలోనే కాదు.. ఆయన ప్రవచనాలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ తనకంటూ ఓ దేశం సృష్టించుకున్నారు. ఆ దేశం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కైలాస్ దేశం ఎక్కడో ఈక్వెడార్ దీవుల్లో ఉందని అంటున్నారు. అయితే ఐక్యరాజ్య సమితిలోనూ తన దేశానికి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.
నిత్యానంద స్వామి .. సినీ నటి రంజితతో చేసిన రాసలీలల వీడియోలతో వెలుగులోకి వచ్చారు. ఆయనపై చాలా లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. అరెస్టు చేస్తారన్న భయంతోనే ఆయన దేశం విడిచిపోయారు. చివరికి సొంత దేశం ఏర్పాటు చేశారు. ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నారన్న అభిప్రాయం కొంత కాలంగా ఉంది. దేశవ్యాప్తంగా నలభై ఒక్క ఆశ్రమాలు ఉండగా.. వేల కోట్ల ఆస్తులు ఆయన పీఠానికి ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలో నిత్యానంద సజీవంగా ఉన్నారా లేదా అన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది.