అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప: ది రూల్’ నుంచి విడుదలైన ‘’పుష్ప ఎక్కడ’ వీడియో ప్రోమో చాలా ఆసక్తిని పెంచింది. ఇప్పుడు పూర్తి వీడియో వచ్చింది. తిరుపతి జైలు నుంచి పుష్ప తప్పించుకోవడం, పోలీసులు కాల్పులు జరపడం, పుష్ప మరణించాడని వార్తలు రావడం, పుష్ప వల్ల లాభపడిన అనేకమంది ప్రజలు రోడ్డు ఎక్కి ఆందోళన చేయడం, పోలీసులు వారిని చదరగొట్టడం, అడవిలో పులుల కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలలో పుష్ప కనిపించడం..ఇలా ఆసక్తి రేకెత్తించేలా ఈ వీడియోని ప్రజంట్ చేశారు.
ఎప్పుడైతే పుష్ప కనిపించాడో అక్కడి నుంచి ఎలివేషన్ మరో రేంజ్ లో వున్నాయి. ‘’అడవి లో జంతువుల రెండు అడుగులు వెనక్కి వేశాయి అంటే పులి వచ్చిందని అర్ధం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం’ అనే డైలాగ్ దానికి తోడైన విజువల్ మంచి ఎలివేషన్ ఇచ్చాయి. చివర్లో ‘పుష్ప గాడి రూలు’ అని పుష్ప చెప్పిన డైలాగు, దానికి దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం అభిమానులకు పండగలా వుంది. మొత్తానికి పార్ట్ 2 పై కావల్సినన్ని అంచనాలని పెంచింది వేర్ ఈజ్ పుష్ప.