జగన్ మిత్రుడు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కనిపించడం లేదు. పార్టీ వ్యవహారాల్లోనూ కనిపించడం లేదు. మంచి వాగ్దాటి ఉన్న ఆయన జగన్ రెడ్డి స్టాండ్ ను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రతిపక్షంలో ఆయన పాత్ర ఇంకా కీలకం. కానీ ఆయన మాత్రం ఇక చాలు మీకో దండం అని పెట్టేశారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
జగన్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు గడికోట. ఆయన ప్రోద్భలంతోనే కాంగ్రెస్ లోనే టిక్కెట్ దక్కించుకున్నారు. తర్వాత జగన్ వెంట నడిచారు. గత ఎన్నికల్లో తప్ప ఎప్పుడూ ఓడిపోలేదు. జగన్ రెడ్డిని అంత నమ్ముకున్నా అధికారంలోకి వచ్చాక ఆయనకు హ్యాండిచ్చారు. మంత్రి పదవిపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ చీఫ్ విప్ పదవి ఇచ్చారు. రెండేళ్ల తర్వాత దాన్నీ తీసేశారు. మంత్రి పదవి ఇవ్వలేకపోతే అంతకు మించిన పదవి ఇస్తారని ఆశపడితే పక్కన పెట్టేశారు.
ఎప్పుడో అవసరమైనప్పుడు ప్రెస్మీట్లు పెట్టించడం తప్ప పట్టించుకోలేదు. చివరికి రాయచోటి టిక్కెట్ ను ఐదేళ్ల పాటు సీఎంవోలో చక్రం తిప్పి ..ఎన్నికలకు ముందు రిటైరైన ధనుంజయ్ రెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడే గడికోట తీవ్ర అసహనానికి గురయ్యారన్న ప్రచారం జరిగింది. ఆయన కోపాన్ని గ్రహించి ఆయనకే టిక్కెట్ ఇచ్చినా పరిస్థితి చేజారిపోయింది. ఎన్నికల తర్వాత గడికోటలో వైరాగ్యం కనిపించిందని తానిక రాజకీయాలకు దూరమని అంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పని చేసినా చివరికి జగన్ రెడ్డి ముంచేస్తాడని అనుకుంటున్నారు.