ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ను మాట్లాడని ప్రధాని అని, మౌన ముని అని బీజేపీ విమర్శించేది. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అనేక కీలక విషయాలపై మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. ఎన్నికల్లో విజయానికి, ప్రధాన మంత్రి కావడానికి మోడీ వాగ్ధాటి కూడా బాగా ఉపయోగపడింది. తీరా ప్రధాని అయిన తర్వాత అనేక ముఖ్యమైన విషయాలపై ఆయన మాట్లాడకుండా విమర్శల పాలవుతున్నారు.
బుధవారం లోక్ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీని గురించే మోడీపై విరుచుకుపడ్డారు. జెఎన్ యు వివాద సమయంలో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు వద్ద విద్యార్థులపైనా, ఆచార్యులపైనా దాడి జరిగింది. సాక్షాతూ కోర్టు ముందు జరిగిన ఈ దాడిని మోడీ ఎందుకు ఖండించలేదని చాలా మంది ప్రశ్నించారు. మరోసారి రాహుల్ కూడా అదే ప్రశ్న వేశారు. ఈ ఘటనపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎవరినీ సంప్రదించకుండానే మోడీ హటాత్తుగా లోహోర్ వెళ్లి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో టీ తాగారని విమర్శించారు. ఇంత కాలం భారత ప్రయోజనాలను కాపాడటానికి తాము చేసిన ప్రయత్నం వృథా అయ్యేలా మోడీ ప్రవర్తించారంటూ రాహుల్ దుయ్యబట్టారు.
నల్లధనంపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన మోడీ, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ విమర్శించారు. బడ్జెట్లో నల్లధన కుబేరులపై ఉక్కు పాదం మోపే చర్యలకు బదులు వాళ్లను నొప్పించని ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. గత కొంత కాలంగా మోడీ వ్యవహార శైలిపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. వాస్తవం అర్థమైన తర్వాత ఆయన విదేశీ పర్యటనలకు ఫుల్ స్టాప్ పెట్టారు. మొన్నటి సాధారణ బడ్జెట్ కూడా మోడీ బృందంలో వచ్చిన మార్పుకి సూచికలా కనిపిస్తుంది. అయితే, పాటియాలా హౌస్ కోర్టు ముందు దాడి వంటి ఘటనలపైనా స్పందించక పోవడంపై చాలా కాలంగా విమర్శలున్నాయి. అనేక విషయాలపై పొద్దున్నే ట్వీట్ ద్వారా తన అభిప్రాయం తెలిపే మోడీ, కీలక మైన విషయాలపైనా తగిన విధంగా స్పందిస్తే మరింత హుందాగా ఉంటుంది.
మోడీ తన హోం మంత్రి మాట వినరు. రక్షణ మంత్రి మాట వినరు. సాయుధ బలగాల మాట వినరు. బహుశా విదేశాంగ మంత్రినీ సంప్రదించి ఉండరు. లాహోర్ పర్యటన వంటి కీలక విషయాల్లో ఆయన ఎవరి మాట వింటారనే రాహుల్ ప్రశ్న ఆలోచింప చేసేదే. నిజానికి మోడీ లాహోర్ వెళ్లిననాడు దేశ ప్రజలు షాకయ్యారు. పాకిస్తాన్ పై భారత్ విరుచుకు పడితే బాగుండనే భావనతో ఉన్న ప్రజలకు, మోడీ నిర్ణయం మింగుడు పడలేదు. మోడీ లాంటి నాయకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బహుశా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులను, దేశాధినేతలను షాక్ కు గురిచేసి ఉంటుంది.
మన్మోహన్ సింగ్ పరిస్థితి వేరు. ఆయన పేరుకే ప్రధాని. ఈ విషయం అందరికీ తెలుసు. సొంతగా నిర్ణయాలు తీసుకునే అధికారం పదేళ్లలో ఆయనకు ఎప్పుడూ లేదనేదే బీజేపీ ప్రధాన ఆరోపణ. మరి మోడీకి ఏమైంది? ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఉంది. పార్టీలో ఆయనే తిరుగులేని నాయకుడు. పైగా సంఘ్ మద్దతు పుష్కలంగా ఉంది. కాబట్టి కొన్ని ఘటనలపై వెంటనే స్పందించడం, విమర్శలు రాకుండా చూసుకోవడం తప్పనిసరి అని గుర్తించినట్టు లేదు. కాబట్టే ఆయనపై విమర్శలు పెరుగుతున్నాయి. కోరి విమర్శలను పెంచుకోవడం అవసరమా అనేది ఆయనే ఆలోచించుకోవాలి.