ఫ్లవర్లతో ముగిసిపోవాల్సిన వివాదం ఫైర్ వరకూ వచ్చింది. అక్కడే నీళ్లు చల్లి ఆపుకోవాల్సిన గొడవను వైల్డ్ ఫైర్ చేసేసుకున్నారు. ఇప్పుడు దావాలనం అవుతోంది. ఎక్కడిదాకా దహిస్తుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ఆపాలంటే చాలా పెద్ద ప్రయత్నాలు చేయాలి. నీళ్లు చిలకరిస్తే సరిపోయే దశ నుంచి ఇప్పుడు హెలికాఫ్టర్లతో నీళ్లు చల్లినా ఆరుతుందో లేదో తెలియని స్థితికి వైల్డ్ ఫైర్ చేరింది. ఇప్పుడు దీనికి కారకులెవరు అన్నది పక్కన పెడితే అర్జంట్కు దీన్ని ఆపడానికి ఏం చేయాలన్నది చూడటం ముఖ్యం. ఇప్పుడు ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించే పెద్దలెవరు?
అంతకంతకూ విస్తరిస్తున్న వైల్డ్ ఫైర్
సంధ్య ధియేటర్ తొక్కిసలాటతో తలెత్తిన వివాదం.. అల్లు అర్జున్ ను .. అన్ని వ్యవస్థలకూ శత్రువును చేస్తూ పాకిపోతోంది. మొదట ఆయన కాంగ్రెస్ కు శత్రువయ్యారు. తర్వాత ప్రభుత్వానికయ్యారు. తర్వతా రేవంత్ కు ఆయన యాంటీ అన్నట్లుగా చేశారు. ఇప్పుడు పోలీసులకు నెంబర్ వన్ శత్రువన్నట్లుగా పరిస్థితి మారింది. రేపు ఇంకో వర్గానికి శత్రువును చేసేలా వైల్డ్ ఫైర్ పాకిపోతోంది. దీనికి ముగింపు కోసం ప్రయత్నాలు చేయాల్సిన హోదా ఉన్న వారు ఇప్పుడు ఎవరు అన్నది కీలకంగా మారింది. ఈ వివాదం ఎలా సమసిపోతుందో కూడా చాలా మందికి అర్థం కావడం లేదు.
మరు మాట్లాడకుండా న్యాయపోరాటానికి సిద్ధమవడమే అర్జున్ కు మంచి ఆప్షన్
ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ .. అటు రేవంత్ రెడ్డి స్పీచ్ అయిపోగానే వెంటనే ప్రెస్ మీట్ అని ప్రకటించేశారు. ఇదేమైనా పొలిటికల్ కౌంటరా అని అందరూ ఆశ్చర్యపోయారు. మాములుగా అయితే ఎలాంటి మాటలు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలి. లేకపోతే తన నోటీస్ లో లేకుండా తప్పు జరిగిపోయింది. దానికి తన బాధ్యత ఎంత ఉందో అంత తీసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. విషయం కోర్టులో ఉంది కాబట్టి.. న్యాయవ్యవస్థకు వదిలేద్దాం అని రెండు మాటలు చెప్పి ఉంటే సమస్య క్లోజ్ అయిపోయేది. ఓ హీరోపై అనేక ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. వాటిపై స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఈ లాజిక్ ను అల్లు అర్జున్ మర్చిపోయారు.
వైల్డ్ ఫైర్ ఆపుకునే ప్రయత్నం చేయాల్సింది అర్జునే
తనకు తెలియకుండానే వైల్డ్ ఫైర్ లో అర్జున్ చిక్కుకున్నారు. ఇప్పుడు బయటకు రావాలంటే అంత తేలికకాదు. ఏదో ఓమార్గంలో ఫైర్ ఆపుకుని దాంట్లో బయటకు రావాలి. అలా రావాలంటే ముందు ప్రయత్నం చేయాల్సింది అర్జునే. అలాంటి దారి కోసం ముందుగా వీలైనంత సైలెంట్ గా ఉండాలి. ప్రతి దానికి కౌంటర్ ఇవ్వాలనుకుంటే అది అంతకంతకూ పెరిగిపోతుంది. కానీ తగ్గదు. ఈ విషయంలో వంద శాతం బాధ్యత పుష్పదే.