తెలంగాణలో దిశ హత్యాచారం కేసు నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడంపై పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి మంత్రులు ఆనందంగా స్పందించారు. ఇప్పుడు నిజమైన దీపావళి అని.. మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. అదే స్థాయిలో.. రోజా దగ్గర్నుంచి పలువురు స్పందించారు. అందరిదీ.. ఒకటే ఆనందం. నిందితులకు సరైన శిక్ష పడింది. మహిళలకు అభయం దొరుకుతుందని. మరి ఆ ఆభయం ఏపీ మహిళలకు వద్దా..? అక్కడి చిన్నారులకు వద్దా..? మృగాళ్లకు అక్కడ రక్షణ ఎందుకు..?
ఏపీలో ఆరు నెలల్లో ఎన్నో దారుణాలు..! ఎన్ని శిక్షలు వేశారు..?
ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలయింది. ఇప్పటికి.. సంచలనం సృష్టించే స్థాయి ఘటనలు… దిశ తరహా ఘటనలు.. కనీసం అరడజన్ చోటు చేసుకున్నాయి. వైసీపీ గెలిచిన కొత్తలో.. ఒంగోలులో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ బాలికను చెరబట్టిన యువకుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పుడు అది సంచలనం అయింది. దాంట్లో నిందితుడు.. వైసీపీ కార్యకర్త. ఆ తర్వాత దాచేపల్లిలో.. ఓ ముస్లిం బాలికపై.. నరేంద్ర రెడ్డి అనే యువకుడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై ముస్లిం సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధర్నాలు ఆందోళనలు చేశాయి. కానీ నిందితుడు హాయిగా ఉన్నాడు. చిత్తూరు జిల్లాలో ఓ పిసిపాపను.. దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసేశారు. నిందితుడ్ని పట్టుకున్నారో లేదో కూడా క్లారిటీ లేదు.
రాజకీయ పలుకుబడి ఉంటే ఎన్ని ఆకృత్యాలకైనా పాల్పడవచ్చా..?
మహిళలపై జరుగుతున్న దాడులు లెక్క లేకుండా ఉన్నాయి. కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. బాధితుల పరామర్శ కోసం.. జిల్లాలు పట్టుకుని తిరుగుతున్నారు. పదుల సంఖ్యలో.. మహిళలపై దాడులు, ఆకృత్యాల కేసులు నమోదవుతున్నాయి. కానీ.. ఎవరిపైన కూడా.. కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దాచేపల్లిలో ముస్లింబాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి.. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు. ఆయనను.. పోలీసులు అరెస్ట్ చేశారో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఒంగోలులో అత్యాచారానికి పాల్పడింది వైసీపీ కార్యకర్త. ఆయన ఇప్పుడు ఫ్రీబర్డ్. ఇతర కేసుల్లోనూ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా.. కనీసం.. మీడియా ముందుకు కూడా ప్రవేశ పెట్టడం లేదు.
ఒక్క నిందితుడికైనా భయం కలిగించగలిగారా..?
ఇలాంటి కేసుల్లో పోలీసుల వ్యవహారశైలే.. వివాదాస్పదంగా మారుతోంది. నిందితులు … రాజకీయ పార్టీల నేతల్ని ఆశ్రయించడం.. వారు.. పోలీసులపై ఒత్తిడి తెస్తూండటంతో… ఎక్కడిక్కడ బాధితుల్ని… బాధితులుగానే మిగిల్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా… ఇలా చిన్నారులపై ఆకృత్యాలకు పాల్పడేవారిని అరెస్ట్ చేయడంలో కానీ.. శిక్షించడంలో కానీ చూపించడం లేదు. సీఎం జగన్.. ఇలాంటి నేరాలు జరిగినప్పుడు.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తారు. కానీ.. ఎక్కడా తీసుకోరు. ఫలితంగా… నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తెలంగాణ పోలీసుల్ని చూసి అయినా ఏపీ పోలీసులు నేర్చుకుంటారో లేదో మరి..!