పీఆర్సీ కోసం రోడ్డెక్కి.. అరకొర ప్రయోజనాలు దక్కించుకున్నా ఆ జీవోలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఉద్యోగ సంఘ నేతలతో మొత్తం 17 అంశాలపై ప్రభుత్వం అగ్రిమెంటు చేసుకుంది. వాటిల్లో సీపీఎస్ కూడా ఒకటి. మార్చిలోపు సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు. కానీ జీపీఎస్‌ను తీసుకొచ్చి అంగీకరించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదొక్కటే కాదు ఇంకా అనేక జీవోలు విడుదల కావాల్సి ఉంది.
పే రివిజన్ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా 10 ఏళ్లకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత చర్చల్లో ఎప్పట్లాగే ఐదేళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసేలా అంగీకరించారు. ఐదేళ్లకు మారుస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన చర్చల్లో హామీ ఇచ్చారు. కానీ ఆ జీవో ఇంత వరకూ రాలేదు. ఐఆర్ రికవరీ చేయబోమని హామీ ఇచ్చారు. దానిపైనా ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆర్టీసీ పీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఇస్తామని చెప్పారు. ఆ ఉత్తర్వులూ రాలేదు. కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అగ్రిమెంట్లో పేర్కొన్నారు. అదీ జరగలేదు. మట్టి ఖర్చులు రూ.26 వేలకు పెంచిన అంశంపై ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదు.
ఇచ్చిన హామీల్లో నివేదికను బయటపెట్టడం, హెచ్ఆర్ఏ, సిపిఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సమస్యలపై ఉత్తర్వులు ఇచ్చారు. మిగలిన వాటి ఊసు లేదు. అప్పటికప్పుడు సమ్మెను విరమించడానికి ప్రభుత్వం ఈ హామీలను ఇచ్చింది. ఇవన్నీ గతంలో ఉన్న సౌకర్యాలే . ప్రభుత్వం వాటిని తొలగించింది. తీసేస్తామని చెప్పి సమ్మె విరమింప చేసింది. కానీ జీవోలు మాత్రం ఇవ్వడం లేదు. తమను మోసం చేశారని ఉద్యోగులు ఆవేదన చెందే పరిస్థితి ఏర్పడింది.