చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రెండు, మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి జగన్ వస్తారా రారా అన్నదానిపై అనేక చర్చలు ఉన్నాయి. వస్తారనే అనకుంటే ఆయన సీటు ఎక్కడ ఉంటుందన్న డిబేట్ కూడా ఎక్కువగానే నడుస్తోంది.
వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ ప్రదాన ప్రతిపక్షం కాదు. కావాలనుకుంటే స్పీకర్ టీడీపీ తర్వాత అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చు. ప్రతిపక్ష హోదాకు పదిహేడు మంది ఎమ్మెల్యేలు కావాలి. జగన్ ఆ మార్క్ సాధించలేదు. అదే సమయంలో అసెంబ్లీ లో సీట్ల కేటాయింపు కూడా ఈ స్థానాలను బట్టే ఉంటుంది.
సాధారణంగా మొదటి వరుసల్లో ముఖ్యమంత్రికి.. ప్రతిపక్ష నేతకు కేటాయిస్తారు. తర్వాత స్పీకర్ నిర్ణయం మేరకు సీట్లను కేటాయిస్తారు. ఈ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి.. చివరి వరుసల్లోనే సీటు దొరికే అవకాశం ఉంది..అయితే మొదటి వరుసలో ఇవ్వడానికి స్పీకర్ కు అధికారం ఉంది. స్పీకర్ కేటాయిస్తే.. ఓ వైపు మూలన మొదటి వరుసలో జగన్ కూర్చునే అవకాశాలు ఉన్నాయి.
అయితే జగన్ పట్ల ఉదారంగా వ్యవహరించడానికి ఆయనేమీ సంప్రదాయ బద్దంగా తాను అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించలేదు. అందుకే ఆయనకు అర్హత లేని గౌరవ మర్యాదలు ఇచ్చే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.