వల్లభనేని వంశీ మొబైల్ కోసం పోలీసులు మైహోమ్ భూజాలోని ఆయన నివాసాన్ని జల్లెడ పట్టారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు అదుపులోకి తీసుకునే వరకూ ఆయన ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఫోన్ కనిపించలేదు. బూత్ రూల్ కమోడ్ లో పడేసి నీళ్లు కొట్టేశారో లేకపోతే.. ఎక్కడైనా పడేశారా అన్నదానిపై స్పష్టత లేదు. మొత్తంగా ఆయన తన సెల్ ఫోన్ దొరక్కుండా చేయగలిగారని పోలీసులు చెబుతున్నారు. ఇతర మార్గాల ద్వారా ఆయన కాల్ డేటా.. ఇతర విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వంశీ కేసులో సత్యవర్థన్ కూడా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. కోర్టులో కూడా ఇంకో సారి స్టేట్ మెంట్ ఇస్తానని.. తనను కిడ్నాప్ చేసి బెదిరించి కేస్ విత్ డ్రా చేసుకునేలా చేశారని ..తన కుటుంబానికి హాని చేస్తారన్న భయంతోనే తాను అలా చేసినట్లుగా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని కోర్టులో చెప్పించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు. మరో వైపు వంశీ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి ఇచ్చేదాన్ని బట్టి ఆయనను ప్రశ్నించి పలు వివరాలు రాబట్ట అవకాశం ఉంది.
వంశీపై నమోదైన కేసులు చిన్నవి కావు. ఫిర్యాదుదారునే బెదిరించి కేసును వెనక్కి తీసుకునేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే బెయిల్ పిటిషన్ ఎలా వేయాలన్నదానిపై ఆయన లాయర్ల బృందం పరిశీలన జరుపుతోంది. మరో వైపు ఆయన భార్య జైల్లో వంశీని పలకరించారు. తాము కోట్లు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కానీ ఇరవై వేల కోసం కిడ్నాప్ అని పోలీసులు కేసు పెట్టారని ఆమె వాపోయారు. వంశీ మొబైల్ ఎక్కడుందో తనకూ తెలియదని ఆమె పోలీసులకు చెబుతున్నారు.