తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యులో ఎస్ఐబీ ఓఎస్డీ వేణుగోపాల్ రావు విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయంపై స్పష్టత రావడం లేదు. ఈ విషయంలో పోలీసులు కావాలనే గోప్యత పాటిస్తున్నారా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో వేణుగోపాల్ రావు కీలకంగా వ్యవహరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. మంగళవారం రాత్రి 11 గంటలకు వేణుగోపాల్ రావు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వచ్చారని ప్రచారం జరిగింది . కానీ పోలీసులు మాత్రం వేణుగోపాల్ రావు విచారణకు రాలేదని చెప్పడంతో పోలీసులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
గురువారం నుంచి రాధాకిషన్ రావుకు పోలీసు కస్టడీ మొదలు కాబోతోంది.దీంతో రాధాకిషన్ తో వేణుగోపాల్ రావును కలిపి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే వేణుగోపాల్ రావు విషయంలో పోలీసులు గోప్యత మెయిన్ టెన్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాధాకిషన్ రావు పోలిసు కస్టడీలో ఎలాంటి విషయాలు బయటపెడుతాడో అన్నది ఆసక్తికరంగా మారింది. కస్టడీలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో విచారణ జరుగుతున్నట్టుగా తెలిసింది. దీంతో రాధాకిషన్ కస్టడీతో మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశం ఉంది.