ఆచార్య… ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఇంత యునానిమస్‌గా ఓ సినిమాని ఫ్లాప్ అని తేల్చడం ఈమధ్య కాలంలో.. ఇదే తొలిసారి. `రాధేశ్యామ్`, `బీస్ట్` సినిమాలకు కూడా కాస్తో కూస్తో డివైడ్ టాక్ వచ్చింది. `బాగుంది` అన్నవాళ్లు కనిపించారు. కానీ `ఆచార్య` ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. అందరినోటా.. ఒకటే మాట. అయితే వేళ్లన్నీ కొరటాల శివ వైపే చూపిస్తున్నాయి. కొరటాల ఇంత దారుణమైన కథ రాసి, నీరసమైన సీన్లతో సహనానికి పరీక్ష పెడతాడనుకోలేదని మెగా వీరాభిమానులు సైతం.. గగ్గోలు పెడుతున్నారు. నిజానికి ఆచార్య అనే సినిమా పట్టాలెక్కడంలోనే పెద్ద మతలబు ఉంది. తొలి తప్పటడుగు అక్కడే పడింది.
రామ్ చరణ్ – కొరటాల కాంబోలో ఓ సినిమా రావాలి. అన్నీ సిద్ధమైపోయాయి. సరిగ్గా అప్పుడే `ఆర్.ఆర్.ఆర్` నుంచి పిలుపు వచ్చింది. ఈ దశలో..కొరటాల శివని వదులుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు చరణ్ సుతిమెత్తగా… `నాతో కాకుండా డాడీతో చేస్తారా` అని అడగడం, దానికి కొరటాల ఒప్పుకోవడం జరిగిపోయాయి. ఇదంతా యధాతధంగా జరిగిందే. ఈ విషయాన్ని చిరు,చరణ్‌లు సైతం చెప్పారు.
కాకపోతే.. అప్పటికి కొరటాల దగ్గర చిరంజీవికి సరిపడ కథ లేదు. `కథ లేదు… చేయడం కుదరదు` అని చెబితే మెగా ఛాన్స్ మిస్సయిపోతుంది. అందుకే అప్పటికప్పుడు చిరు కోసం కథ వండడం మొదలైంది. కొరటాల దగ్గర ఓ 10 కథల వరకూ ఉన్నాయి. అవన్నీ బౌండెడ్ స్క్రిప్టులు. అందులో చిరుకి సరిపడ కథ ఉంటే బాగుండేది. ఓ కథ రాసి, అది చిరుకి బాగుంటుంది అనుకుని వెళ్లడం వేరు, చిరు అడిగితే అప్పటికప్పుడు కథ రాయడం వేరు. చిరు కోసం ఓ కథ రాయడం మొదలెట్టి, చరణ్ కోసం ఓ పాత్రని సృష్టించి, దాన్ని పెంచుకుంటూ పోయి.. ఇలా `ఆచార్య` కథ రకరకాలుగా తయారైపోయింది. కాజల్ పాత్రని చివర్లో తీసి పక్కన పెట్టడం వల్ల కూడా కొన్ని జర్కులు వచ్చి పడ్డాయి. రీషూట్లు, ఎడిటింగ్ టేబుల్ మీద కటింగులు.. ఇలా కథంతా కలగాబులగం అయిపోయింది. మొత్తానికి ఏదైతేనేం.. కొరటాల కెరీర్లో తొలి ఫ్లాప్ పడింది. అయితే.. ఇద్దరు మెగా హీరోలతో కలిసి చేసిన సినిమాతో రావడంతో.. అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.