రాజేంద్ర ప్రసాద్ మా అధ్యక్షేడిగా ఎన్నికై.. యేడాది దాటిపోయింది. ఈలోగా సంక్షేప పథకాలెన్నో ప్రారంభించి, మా సభ్యుల్ని ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల వాగ్దానాల్ని ఒకొక్కటిగా నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ.. ఎన్నికల సమయంలో ఓ భారీ వాగ్దానం ఒకటి చేశారు నటకిరీటి. ”ఐదు కోట్లతో ఓ ఫండ్ ఏర్పాటు చేస్తా. ఆ ఐదు కోట్లూ నేనే సేకరిస్తా” అన్నారు. మా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ గెలవడానికి ఆ వాగ్దానం కూడా కారణమైంది.
అయితే.. మా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా… ఆ ఐదు కోట్ల ఊసెత్తలేదు రాజేంద్ర ప్రసాద్. మరి ఆ ఐదు కోట్లు ఏమైనట్టు? ఎన్నికల వాగ్దానం నటకిరీటి మర్చిపోయాడా? అసలు ఆ ప్రయత్నాలేమైనా మొదలెట్టారా? మొదలెడితే ఎంత వరకూ వచ్చాయి? ఇవన్నీ రాజేంద్రప్రసాద్ అండ్ టీమ్ కే తెలియాలి. రాజేంద్రప్రసాద్‌కి విదేశాల్లో చాలామంది అభిమానులున్నారు. వాళ్లందరితో మాట్లాడి డొనేషన్లు సేకరించాలని రాజేంద్ర ప్రసాద్ ఆలోచన. అంతేకాదు.. ఇటీవల వివిధ సంస్ర్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు నటకిరీటీ. వాళ్ల దగ్గర ‘ఫీజు’గా కొంతమొత్తం అందుకొని దాన్ని ‘మా’ ఫండ్‌కి తరలించాలని ప్రయత్నిస్తున్నారు. మా ఖాతాలో అంతగా నిధుల్లేవు. ఏ సమస్య పరిష్కారమైనా ఆర్థిక బలంతో ముడిపడి ఉంది. ముందు ‘మా’ కోసం నిధుల్ని ఎలా సేకరించాలో రాజేంద్ర ప్రసాద్ ఆలోచించాలి. ‘మా’ని ఆర్థికంగా బలోపేతం చేయాలి. రూ.5 కోట్లు కాకపోయినా ఎంతో కొంత శాశ్వత నిధి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. మరి రాజేంద్రుడు ఏం చేస్తాడో?? ఆ కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడో?