శ్రీరెడ్డి లానే మరో అమ్మాయి కూడా సినీ అకృత్యాలకు బలైందా? ఈ విషయంలో ‘మా’ కలగజేసుకుని ఓ పరిష్కార మార్గం చూపించిందా? ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాటలు వింటుంటే `అవును` అనే చెబుతారంతా. శ్రీరెడ్డి కి మా సభ్యత్వం ఇవ్వం.. అంటూ.. శివాజీ రాజా తేల్చి చెప్పిన సందర్భంలో నోరు జారి మరో దర్శకుడి ప్రస్తావన తీసుకొచ్చారు. శ్రీరెడ్డి తరహాలోనే తమ దగ్గరకి ఓ ఫిర్యాదు వచ్చిందని, ఓ నటిని ఇబ్బంది పెట్టిన ఓ పెద్ద దర్శకుడ్ని అందరి సమక్షంలో ఆమె కాళ్లు పట్టుకునేలా చేశామని శివాజీరాజా చెప్పేశాడు. శ్రీరెడ్డి వివాదంలో ఈ మాటలు కొట్టుకెళ్లిపోయాయి గానీ… ఓ నటి కాళ్లని ఓ ప్రముఖ దర్శకుడు పట్టుకునేంత తీవ్రంగా ఓ సమస్య వెళ్లడం మామూలు విషయం కాదు. అంటే.. అంతర్గతంగా ఇలాంటి వ్యవహారాల్ని ‘మా’ గుట్టు చప్పుడు కాకుండా సర్దుతుందన్నమాట. శివాజీ రాజా ఎప్పుడైతే నోరు జారాడో.. అప్పటి నుంచి ఆ దర్శకుడు ఎవరు? కాళ్లు పట్టించుకున్న ఆమె ఎవరు? అనే చర్చ మొదలైంది. వాళ్ల పేర్లు ‘మా’ ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టదు. అయితే.. ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తేనే మంచిది. మిగిలిన వాళ్లందరికీ ఓ కనువిప్పుగా ఉంటుంది.