తొమ్మిదో తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో.. జగన్ పాదయాత్ర ముగింపు సభలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. హాస్యనటుడు అలీ.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో… ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయనతో భేటీ అయ్యారు. ఏం చర్చించారన్నదానిపై క్లారిటీ లేదు. కానీ.. రాజకీయమే అన్న చర్చ మాత్రం నడుస్తోంది. కొద్ది రోజుల కిందట.. విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిని అలీ కలిశారు. ఆ తర్వాత ఆయనకు పార్లమెంట్ టిక్కెట్ ను జగన్ ఖరారు చేశారని.. తొమ్మిదో తేదీన వైసీపీలో చేరబోతున్నారని.. ఆయన సన్నిహితులు ప్రచారం చేశారు. సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారరమయింది. దీనిపై అలీ స్పందించలేదు. దాంతో..అందరూ నిజమేనుకున్నారు.
ఈ ప్రచారం ఇలా జరుగుతూండగానే ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు. నిజానికి.. తెలుగుదేశం పార్టీతో అలీ చాలా కాలంగా సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు కానీ.. వివిధ కారణాలతో ఆయనకు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేయలేకపోయారు. గుంటూరు తూర్పు స్థానంలో ముస్లింలు ఎక్కువ ఉంటారు కాబట్టి.. అక్కడ టిక్కెట్ ఇస్తారని ఆశించారు. అయితే బీజేపీతో పొత్తు కారణంగా చంద్రబాబు అప్పట్లో ఆ సీటును.. వైశ్య సామాజికవర్గానికి కేటాయించారు. ఆ తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో రాజకీయాలపై దృష్టి సారించారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా యాక్టివ్ కావడంతో.. సినిమాలు మానేసి.. ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేస్తూండటంతో.. మిత్రునికి తోడుగా అలీ కూడా… జనసేనలో చేరుతారని అనుకున్నారు.
పవన్ కల్యాణ్ పిలువలేదో… మరో కారణమో కానీ… జనసేన పార్టీలో అలీ చేరలేదు. అమరావతి వచ్చిన అలీ పవన్ కల్యాణ్‌తోనూ మంతనాలు జరిపారు. అంతిమంగా అలీ.. ఏ పార్టీలో చేరతాడరన్న విషయంపై క్లారిటీ లేదు . అలీ కూడా.. తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించడం లేదు. రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న అలీ.. ఏదో ఓ పార్టీలో బరిలో ఉండాలని అనుకుంటున్నారు. అలాగని.. మిగతా రెండు పార్టీలతో ఆయన శతృత్వాన్ని కోరుకోవడం లేదు. కానీ.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. అది సాధ్యం కాదనే విషయాన్ని అలీ అంచనా వేయలేపోతున్నారని… రాజకీయవర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును, పవన్ ను కలిసిన తర్వాత .. వెళ్లి వైసీపీలో చేరినా… అక్కడ జగన్ ఆదరించడం కష్టమని… జగన్.. రాజకీయ నిర్ణయాలను.. విశ్లేషించిన వాళ్లు చెప్పేమాట. మరి అలీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో మరి..!