అదిగో రాజీనామా… ఇదిగో రాజీనామా… వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పేస్తారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. వైసీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు, జగన్ పై అసంతృప్తి అన్నీ కలిసి… బాలినేని పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖను జగన్ కు పంపారు.
అయితే, బాలినేని ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా బాలినేని పార్టీ మారుతారు అన్న ప్రచారం ఉంది. ఆయన జనసేనలోకి వెళ్తారు అన్న ప్రచారం ఉంది. బాలినేని దూకుడుకు జనసేన పార్టీ అయితే సెట్ అవుతుందని, పవన్ తో ఉన్న సన్నిహితం కూడా అడ్వాంటేజ్ అవుతుందని, ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం ఉంది. పైగా ఒంగోలులో ఆయన వెంట ఇన్ని రోజులు నడిచిన క్యాడర్ చాలా వరకు టీడీపీ, జనసేనలోకి వెళ్లిపోయింది.
ఇక మరోవైపు వైఎస్ ఫ్యామిలీతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పార్టీలు వేరైనా… వైఎస్ షర్మిలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. షర్మిల కూడా వైఎస్ కార్డుతోనే ఏపీలో రాజకీయం మొదలుపెట్టిన నేపథ్యంలో… షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ దశలో బాలినేని రాజీనామా చేయటంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న బాలినేని పార్టీ మార్పు తర్వాత జిల్లాలో వైసీపీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వక తప్పదన్న అభిప్రాయం వైసీపీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.