లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో చేసిన పొరపాటు ఆ పార్టీని కొంత వెనక్కి నెట్టింది. బీజేపీ మాత్రం మోడీ , అమిత్ షా, జేపీ నడ్దాలను ప్రచారంలోకి దింపి దూకుడుగా వ్యవహరించడం సానుకూలాంశంగా మారింది. బీఆర్ఎస్ ఒక్క సీటైనా గెలుస్తుందా..? అనే విమర్శల మధ్య కేసీఆర్ బస్సు యాత్ర ఆ పార్టీని ఎన్నికల రేసులోకి తెచ్చింది.
కాంగ్రెస్ 14సీట్లు గెలుస్తుందని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీ 14 సీట్లు దక్కించుకుంటుందనే నమ్మకం జనాల్లో కలిగించారు. కానీ , అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ నాయకత్వం కనబరిచిన అతి విశ్వాసం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారనుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం ప్రత్యర్ధి పార్టీలకు అనుకూలంగా మారిందన్న విశ్లేషణలు వ్యక్తం అయ్యాయి.
బీజేపీ మాత్రం ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది.ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా, మళ్లీ వచ్చేది బీజేపీనేనని విశ్వాసాన్ని కలిగించింది. ఇది ఆ పార్టీకి బలం పెంచగా,కాంగ్రెస్ చేసిన పొరపాట్లను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కొంత సక్సెస్ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఇక, కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ లో మార్పు వచ్చిందన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఓట్లు చీల్చితే అది కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారనుంది.
14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన హస్తం పార్టీ ప్రకటించినట్లుగానే 14 సీట్లు గెలుస్తుందా..? అమిత్ షా ప్రకటించినట్లుగా డబుల్ డిజిట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందా ..? అందరి అంచనాలను తలకిందులు చేసేలా బీఆర్ఎస్ ప్రభావం చూపనుందా..? అనే చర్చ జోరుగా జరుగుతోంది.