2019 ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులకు వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరోసారి తన స్థానాన్ని దక్కించుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇక, గత ఎన్నికల్లో తృటిలో చేజారిన అధికారాన్ని ఒడిసి పట్టడం కోసం వైకాపా కూడా అన్ని శక్తులూ ఒడ్డుతుంది. అయితే, మధ్యలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర ఏమిటనేదే చర్చనీయాంశంగా మారుతోంది. ఆంధ్రాలో టీడీపీ సర్కారును ఎదుర్కోవాలంటే ఇతర రాజకీయ పక్షాలన్నీ కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందనేది తెలిసిందే. అయితే, ఆ కూటమి ఎలా ఏర్పడుతుంది..? ఎవరు లీడ్ చేస్తారా..? కాంగ్రెస్, వైకాపా, జనసేన.. ఈ భిన్న ధ్రువాలను ఒక తాటిమీది తేవడం సాధ్యమా..? ఆ ప్రయత్నాన్ని ఎవరు ప్రారంభిస్తారు.. పవనా, జగనా, లేదా కాంగ్రెస్ నాయకులా..? ఈ ప్రశ్నలకు వైకాపా వర్గాల్లో ఓ కొత్త సమాధానం వినిపిస్తోందని చెప్పాలి.
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైకాపా సంసిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యూహాల్లో భాగంగా రాజకీయ సలహాదారులను జగన్ ఆశ్రయిస్తున్న విషయమూ విదితమే. ప్రముఖ రాజకీయ సలహాదారు ప్రశాంత్ తాజాగా ఓ నివేదికను తయారు చేశారట. ఆంధ్రాలో మహాకూటమి అవసరమని ఆయన జగన్ కు చెప్పినట్టు చర్చ తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తోపాటు ఇతర రాజకీయ పార్టీలను కూడా కూటమిలోకి ఆహ్వానించాలనీ, దాని కోసం ఇప్పట్నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలని ఆయన నివేదికలో పేర్కొన్నట్టు చర్చ మొదలైంది.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. పవన్ కల్యాణ్ తో కలయికకు సంబంధించిన అంశం మరోసారి వైకాపా వర్గాల్లో చర్చనీయంగా మారడం. నిజానికి, ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలోనే ఈ ఇద్దరూ ఒక వేదిక మీదికి వస్తారని ఆశించారు. తెర వెనక కొన్ని ప్రయత్నాలు కాస్త తీవ్రంగానే జరిగాయని కూడా అప్పట్లో గుసగుసలు వినిపించాయి. పవన్ ను తమవైపు ఆకర్షించగలిగితే, చంద్రబాబుకు పెద్ద ఝలక్ అవుతుందన్నది వైకాపా వ్యూహం. ఇప్పుడు కూడా వైకాపా ప్రయత్నం కాస్త తీవ్రంగానే ఉందని సమాచారం! ఉత్తరాంధ్రకు చెందిన ఒక ప్రముఖ కాపు నాయకుడుకి పవన్ ను ఒప్పించే పని జగన్ పురమాయించినట్టు తెలుస్తోంది. ఆ నాయకుడు ఇంకెవరూ… బొత్స సత్యనారాయణ అని వేరే చెప్పాల్సిన పనిలేదు.
అయితే, 2019లో తమది సోలో పర్ఫార్మెన్స్ అని ఆ మధ్య పవన్ అనేవారు.. ఈ మధ్య మానేశారనుకోండి! పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరంగా ఉన్నారా.. అంటే, చెప్పలేని పరిస్థితి. భాజపాతో మాత్రం కాస్త తెగతెంపుల ధోరణిలోనే ఈ మధ్య మాట్లాడుతున్నారు. ఇక, వామపక్షాలతో పవన్ దోస్తీ ఉండే అవకాశాలు ఉన్నాయనే చెప్పగలం. కాంగ్రెస్ తో పవన్ కలయిన ప్రస్తుతానికి ఊహించలేం. ఈ పరిస్థితుల్లో జగన్ వైపు పవన్ మొగ్గు చూపే ఛాన్సులు కూడా చాలాచాలా తక్కువ. ఎందుకంటే, జగన్ మీద కొన్ని కేసులున్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ జగన్ వైపు పవన్ మొగ్గు చూపితే.. ఓ రేంజిలో విమర్శలు వెల్లువెత్తడం ఖాయం. ఇంకోటీ.. జగన్ వైపు పవన్ తొంగి చూస్తే.. పవన్ ను టీడీపీ చూసే ధోరణి కచ్చితంగా మారిపోతుంది! కాబట్టి, జగన్ ను ఆహ్వానం అందినా… ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం బొత్స లాంటివారు రాయబారాలు, బేరసారాలు నడిపినా… పవన్ నుంచి స్పందన ఉండకపోవచ్చు. మరి, ఈ లెక్క జగన్ రాజకీయ సలహాదారుకి అవగతం కావడం లేదో ఏమో..?