భారత్, పాక్ సంబంధాలు ఎప్పుడూ గత ఆరు దశాబ్దాలుగా మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయే తప్ప ఏనాడూ కనీసం ఒక ఏడాది పాటు నిలకడగా సాగిన దాఖలాలు లేవు. పాక్ వెనుకబాటుతనం, ఆ కారణంగా ఆ దేశంలో సమస్యలు, మతతత్వవాదం, ఛాందసవాదం, ఉగ్రవాదం, పాక్ సైన్యాధికారుల యుద్ధోన్మాదం, ప్రభుత్వంపై వారి కర్ర పెత్తనం వంటి అనేక కారణాల వలన భారత్ పట్ల పాక్ అకారణ ద్వేషం పెంచుకొంది. తన అంతర్గత సమస్యలు, ప్రభుత్వ అసమర్ధత నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే భారత్ ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తోంది.
ఆ ప్రయత్నంలోనే భయంకర విషసర్పం వంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒక్కోసారి దాని కాటుకి పాక్ ప్రజలే బలైపోతున్నా కూడా పాక్ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్న ఆ సమస్యల కారణంగా అది భారత్ ని దెబ్బ తీసేందుకు ఉగ్రవాదులతో అంటకాగుతోంది. కాశ్మీర్ లో వేర్పాటువాదులని వెనుకనుంచి ప్రోత్సహిస్తోంది.
బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తరువాత పాక్ ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో మరింత స్పష్టమైన వైఖరి కనబరచడం మొదలుపెట్టడం గమనార్హం. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా పాక్ ఆక్రమిత కాశ్మీరులో పర్యటించడమే కాకుండా, మిగిలిన కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్ లో కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడమే అందుకు ఒక ఉదాహరణ. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా, బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తరువాత కాశ్మీరులో అందోళనలకి మద్దతు పలికారు. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని గట్టిగా వాదించి ప్రపంచ దేశాలు కాశ్మీర్ పై దృష్టిసారించేలాగ చేయగలిగారు.
పాక్ తీవ్రనేరాలకి పాల్పడుతున్నప్పటికీ దానిని సమర్ధంగా ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడూ తడబడుతూనే ఉంటుందని పఠాన్ కోట్ దాడుల వ్యవహారంలో మళ్ళీ ఇప్పుడు కాశ్మీర్ అల్లర్ల సమయంలో స్పష్టం అయింది. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ ని పాక్ ప్రభుత్వం ఒక అవకాశంగా మలుచుకొంటే, పఠాన్ కోట్ దాడులు, కాశ్మీరులో అల్లర్ల విషయంలో ప్రపంచదేశాల ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టగల ఒక గొప్ప అవకాశాన్ని భారత్ చేజార్చుకొందని చెప్పక తప్పదు.
కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా, పాక్ పట్ల భారత్ ఆలోచనలు, వైఖరిలో మార్పులు వస్తుంటాయి. కానీ, పాక్ లో ప్రజాప్రభుత్వమే అధికారంలో ఉన్నా సైనిక ప్రభుత్వం అధికారంలో ఉన్నా భారత్ పట్ల పాక్ వైఖరి చాలా నిర్దిష్టంగా ఉంటుంది. నాటి నుంచి నేటికీ ఎప్పటికీ దానికే అది కట్టుబడి ఉంటుందని నిరూపిస్తూనే ఉంది. అది భారత్ ని ఎప్పుడూ తన శత్రువుగానే చూస్తుంది. ఆ సంగతి తెలిసి ఉన్నప్పటికీ, భారత్ కి మాత్రం పాక్ పట్ల నిర్దిష్టమైన వైఖరి, విధానాలు లేకపోవడం చాలా విచిత్రంగా ఉంటుంది.
కాశ్మీర్ పై పాక్ మనసులో ఆలోచనలు ఆ దేశ ప్రధాని బయటపెట్టిన తరువాత ఆ దిశలో ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు నిఘా వర్ఘాలు దృవీకరిస్తున్నాయి. లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడు అబూ దుజాన్ కాశ్మీరులో నిన్నజరిగిన ర్యాలీలో పాల్గొన్నట్లు కనుగొన్నాయి. అతను బుర్హాన్ వనీ అంత్యక్రియలకి కూడా హాజరైనట్లు నిఘా సంస్థలు కనుగొన్నాయి. అంటే బుర్హాన్ వనీ స్థానంలో అంతకంటే కరుడుగట్టిన ఉగ్రవాది అబూ దుజాన్ ప్రవేశించినట్లు స్పష్టం అవుతోంది. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ చేసి, తదనంతరం తలెత్తిన పరిస్థితులని సమర్ధంగా ఎదుర్కోలేకపోయిన భారత్, ఇప్పుడు అబూ దుజాన్ని కూడా మట్టుబెట్టే సాహసం చేయగలదా? చేస్తే పాక్ ఊరుకొంటుందా? కాశ్మీరులో వేర్పాటువాదులు ఊరుకొంటారా? అన్నీ ప్రశ్నలే తప్ప జవాబులు కనబడవు.