దినదిన గండం దీర్ఘాయుష్షు అన్నట్టుగా కనిపిస్తోంది కర్ణాటకలోని కుమార స్వామి ప్రభుత్వం. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో… కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు ముఖ్యమంత్రి కుమార స్వామికి తలనొప్పులు తెచ్చిపెడుతోందని చెప్పొచ్చు. రెండురోజుల కిందట ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసగా గైర్హాజరు అవుతున్న పరిస్థితి. కర్ణాటకలో మొదట నలుగురు గైర్హాజరుతో ప్రారంభమై, ఇప్పుడా సంఖ్య మెల్లగా ఇంకా ఇంకా పెరుగుతోందని సమాచారం. దీంతో కుమాస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిందనీ, బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడతారంటూ భాజపా విమర్శలు చేస్తోంది. ప్రస్తుతం గైర్హాజరైన ఎమ్మెల్యేలను ముంబయి సమీపంలోని ఒక రిసార్ట్ లో భాజపా దాచి ఉంచిందని సమాచారం.
ఈ నేపథ్యంలో కుమారస్వామి మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశాన్ని రక్షిస్తున్నా అని చెప్పుకునే ప్రధాని మోడీ, స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప సాగించిన బేరసారాలకు సంబంధించిన ఒక ఆడియో టేపును కూడా కుమారస్వామి బయటపెట్టారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలూ తన దగ్గర ఉన్నాయన్నారు. ఆధారాలున్నప్పుడు ఫిర్యాదులు చెయ్యొచ్చు కదా అని ప్రశ్నిస్తే… రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ మోడీ నిర్వీర్యం చేశారనీ, ఏ విచారణ సంస్థను ఆశ్రయించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పటికే భాజపా రెండుసార్లు ప్రయత్నించిందనీ, ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు.
అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. బడ్జెట్ సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని ఆదేశించింది. ఇదే అవకాశాన్ని అదనుగా తీసుకుని, మైనారిటీలో ఉన్న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకూడదనే పాయింట్ ను లేవనెత్తి, రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తీసుకొచ్చే ప్రయత్నంలో భాజపా ఉందనేది కుమారస్వామి ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే భాజపా నేతలు కూడా గవర్నర్ ని కలిసి… సంకీర్ణ సర్కారు మైనారిటీలో పడిందని ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి, ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కర్ణాటకలో భాజపా అధికారం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నట్టుగానే కనిపిస్తోంది.