తెలుగుదేశం పార్టీ రాజధానిపై పోరాటాన్ని… పార్టీ ఆదేశాలను ధిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్యేలను కార్నర్ చేయడానికి కూడా ఉపయోగించుకుంటోంది. అసెంబ్లీ సమావేశాలకు తక్షణం హాజరై.. పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని.. ఓటు వేయాలని.. ఆదేశిస్తూ… టీడీపీ విప్ జారీ చేసింది. తనకు ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు.. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని కలిసి.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. వారిద్దరికీ కూడా.. ఈ విప్ వర్తించేలా జారీ చేశారు. రేపు అసెంబ్లీలో బిల్లులపై ఓటింగ్ జరిగితే… టీడీపీ విధానానికి అనుకూలంగా ఓటు వేయాలి. పార్టీ అలా కాకుండా.. ఆబ్సెంట్ అయినా సరే… విప్ ఉల్లంఘన కింద అనర్హతా వేటు పడే అవకాశం ఉంది. అయితే.. అంతా స్పీకర్ చేతిలోనే ఉంది. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. సహజంగా విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తక్షణం వేటు వేస్తారు.
గతంలో.. టీడీపీ అలా చేయలేదని.. తాము అలాంటి బాటలో పోబోమని.. అనేక సార్లు.. వైసీపీ చెప్పింది. కానీ.. ఇప్పుడు.. భిన్నమైన వ్యూహాన్ని అవలంభిస్తోంది. టీడీపీ నుంచి ధిక్కరించేలా చేసి.. విడి సభ్యులుగా గుర్తించే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏదైనా ఒకటే… అయినా.. సాంకేతికంగా మాత్రం.. వారు వైసీపీలో చేరలేదు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరితే మాత్రమే అనర్హతా వేటు వేస్తామంటూ.. ఇప్పుడు వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అందుకే.. విప్ ఉల్లంఘించినప్పటికీ.. వారిపై వేటు పడాలంటే.. స్పీకర్ అంగీకరించాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే… జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి.
ప్రస్తుతానికి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ సమయంలో ఉపఎన్నికలు రావాలని.. తెలుగుదేశం పార్టీ కోరుకుంటోంది. కానీ వైసీపీ కోరుకోవడం లేదు. అందుకే.. వంశీ, గిరిలు విప్ ఉల్లంఘించినా.. పదవులకు వచ్చిన నష్టమేమీ లేదని అంచనా వేస్తున్నారు. కానీ.. ఓ పిటిషన్ స్పీకర్ వద్ద పడితే.. ఎప్పటికైనా.. నిర్ణయం తీసుకోవాలి. తర్వాత పరిస్థితులు తారుమారైతే.. వంశీ, గిరీ ఇద్దరూ రెంటికి చెడ్డ రేవడిగా మారుతారు.