విక్రమ్, కార్తి, సుర్యా, విశాల్.. ఈ తమిళ హీరోలకంటే విజయ్‌కి క్రేజ్ ఎక్కువ. కాకపోతే.. తెలుగులో తనకు అంతగా మార్కెట్ లేదు. తుపాకితో కాస్త మెరుగయ్యాడు. ఆ తరవాత తన సినిమాలు తెలుగులోనూ విరివిగా విడుదలవుతున్నాయి. మంచి వసూళ్లు దక్కించుకుంటున్నాయి. ఇప్పుడు ‘బిగిల్’ కూడా ‘విజిల్’ రూపంలో వస్తోంది. అట్లీ దర్శకత్వం వహించిన చిత్రమిది. నయనతార కథానాయిక. ఈ దీపావళికి విడుదల అవుతోంది.
ఇదో స్పోర్ట్స్ డ్రామా. హీరో ఓ ఫుట్ బాల్ కోచ్. అయితే… స్పోర్ట్స్ డ్రామాలన్నీ కేవలం ఆ ఆట చుట్టూనే తిరుగుతుంటాయి. ఆటలోని గెలుపోటములు, అందులోని భావోద్వేగాలే కథకు ప్రధానం అవుతాయి. ‘విజిల్’ ట్రైలర్ చూస్తుంటే అలా అనిపించడం లేదు. విజయ్ ఇమేజ్‌కీ, ఛరిష్మాకీ తగిన కథ ఎంచుకుని, అందులో స్పోర్ట్స్ డ్రామా కూడా కలిపినట్టు అర్థం అవుతోంది. విజయ్ ఇమేజ్‌కి తగిన డైలాగులు, మేనరిజం.. ఇవన్నీ పుష్కలంగా ఇందులో కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామా అంటే గ్రాండియర్ మామూలే. ఓ బాలీవుడ్ సినిమాకి తగినట్టు… రిచ్ లుక్ వచ్చింది. ఫైట్స్ క్లాస్‌కి క్లాస్, మాస్‌కి మాస్ అన్నట్టున్నాయి. అన్ని రకాల భావోద్వేగాల్నీ బాగానే మేళవించినట్టు అర్థమవుతోంది. చెక్ దే ఇండియా స్ఫూర్తి ఎంత వరకూ ఉందో తెలీదు గానీ, అమ్మాయిల జట్టుకు హీరో కోచ్ అవ్వడం అనే పాయింటు మనకు అక్కడి నుంచే మొదలైంది. మొత్తానికి ఈ దీపావళికి ఓ మంచి మాస్ స్పోర్ట్స్ డ్రామా చూడబోతున్నామన్న భరోసాని కలిగించడంలో ఈ ట్రైలర్ సఫలమైందనే చెప్పాలి.