ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తొలగించాలని సుప్రీంకోర్టు జూన్ 3వ తేదీన తుది ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల గడువు ఈ నెలాఖరు మరో మూడు రోజుల్లో ముగుస్తుందనగా.. ఏపీ ప్రభుత్వం ఒక్క సారిగా నిద్ర లేచింది. అప్పటి వరకూ సుప్రీంకోర్టు తీర్పు కూడా పట్టనట్లుగా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం ఇష్టం లేదన్నట్లుగా యంత్రాంగం వ్యవహరించింది. కనీసం ఏం చేద్దామన్న చర్చ కూడా జరపలేదు. న్యాయవ్యవస్థ ఆదేశాలు కూడా ధిక్కరిస్తే.. అధికారులే ముందుగా బలైపోతారన్న అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో చొరవ చూపకపోయినా.. ఉన్నతాధికారులు హడావుడిగా జిల్లా స్థాయి అధికారులతో.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. తెలుగు రంగులు వేయాలని ఆదేశించారు.
రంగుల విషయంలో ఉన్నతాధికారులు మొదటి నుంచి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రంగులపై హైకోర్టు కోర్టు ధిక్కారం కింద ఉన్నతాధికారులకు నోటీస్ లు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితోపాటు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. గతంలో పంచాయతీ రాజ్ శాఖ నుంచి జారీ అయిన ఓ జీవో అధారంగానే రంగులు వేశారు. ఇప్పుడు దాన్ని హైకోర్టు కొట్టి వేసింది. కానీ దాని వల్ల వందల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయింది. దానికి బాధ్యులెవరన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనట్లుగా తెలుస్తోంది.
రంగులు మొత్తం తొలగించి.. తెలుపు రంగులు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత సీఎం జగన్ బొమ్మను మాత్రం ఉంచాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ల్లో జగన్ బొమ్మను ఉంచారని జిల్లా అధికారులకు సూచించారు. కానీ అధికారికంగా విడుదల చేసిన జీవోల్లో మాత్రం అది లేదు. దాంతో.. జిల్లా స్థాయి అధికారులు టెన్షన్ పడుతున్నారు. జగన్ బొమ్మును తీసేయాలా.. ఉంచాలా.. అని మథన పడుతున్నారు. తీసేస్తే..ఓ బాధ.. తీయకపోతే మరో బాధ. తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వారు భావిస్తున్నారు.