రాయలసీమ రామన్న చౌదరి సినిమా చూసారా…? ఆ సినిమాలో రామన్న చౌదరి కన్ను ఏదైనా భూమిపై పడితే అది సొంతం చేసుకోవడానికి ఎక్కడి వరకైనా వెళ్తాడు. అవసరమైతే ప్రాణం తీయడానికి కూడా వెనకడుగు వేయడు. సేమ్ టూ సేమ్ మధ్యప్రాచ్యంలో అమెరికా చేస్తుంది ఇదే. కాకపోతే ఆ సినిమాలో రామన్న చౌదరి తండ్రి భూములు అవి. ఇక్కడ అమెరికావి కాదు… అంతే తేడా. అమెరికా టార్గెట్స్ గాని వ్యూహాలు గాని చాలా ఊహకు అందవు. మిడిల్ ఈస్ట్ పై అమెరికా ఆధిపత్యంపై ఓ సీరియల్ తీస్తే వందేళ్ళు ఆడినా ఇంకా కొన్ని ఎపిసోడ్ లు బ్యాలెన్స్ ఉంటాయి.
ఇప్పుడు ఇజ్రాయిల్, ఇరాన్, లెబనాన్, పాలస్తీనా… ఇలా కొన్ని దేశాల్లో రగులుతున్న చిచ్చు వెనుక మాస్టర్ మైండ్ వైట్ హౌస్ అనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్ళడం చాలా మంది సమర్ధించారు. కాని అదే సమయంలో మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో రేగిన చిచ్చు గురించి అంతర్జాతీయ సమాజం పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆఫ్ఘనిస్తాన్ ను దాదాపుగా జల్లెడ పట్టి కొన్ని దశాబ్దాల పాటు పీల్చి పిప్పి చేసిన అగ్ర రాజ్యం ఆ తర్వాత నిదానంగా ఇరాన్ పై కన్నేసింది. ఇరాన్ అంత తేలికగా లొంగే దేశం కాదు అనే క్లారిటీ అమెరికాకు ఉంది.
ఇరాన్ వద్ద ఉన్న సాయుధ బలగాలకు యుద్ద రంగంలో నైపుణ్యం ఉన్నా… వృద్ద సైన్యం అనే విమర్శ ఒకటి ఉంది. కాని ఇరాన్ వద్ద ఉన్న ఆయుధాలు మాత్రం అత్యాధునికమే. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ను చీల్చగలిగే సామర్ధ్యం ఉన్న ఆయుధాలే. ఏదోక రూపంలో ఇరాన్ ను రెచ్చగొట్టి యుద్ధంలోకి దించాలి అని కంకణం కట్టుకుని కూర్చుంది అమెరికా. ఇరాక్, పాకిస్తాన్, ఇజ్రాయిల్… ఇతర గల్ఫ్ దేశాలు అమెరికా మాట వింటున్నాయి. అమెరికా రాజ్యాంగమే ఆ దేశాల్లో నడుస్తుంది. తమ మాట వినకపోతే ఏం చేయగలమో సద్దాం హుస్సేన్ ఉదంతంతో నిరూపించింది అమెరికా.
ఇరాన్ అగ్ర నేతలను ఇజ్రాయిల్ సహకారంతో మట్టుబెట్టిన అమెరికా… భారీ ఎత్తున ఇజ్రాయిల్ నిఘా విభాగం మొసాద్ ఏజెంట్ లను ఇరాన్ లో రంగంలోకి దించింది. వారి సహకారంతోనే అగ్ర నేతలను చంపింది అనేది చాలా మందిలో ఉన్న ధృడమైన నమ్మకం. అమెరికా మద్దతు లేకుండా తన చుట్టూ ఉన్న దేశాలతో ఇజ్రాయిల్ యుద్దానికి దిగడం అనేది అసాధ్యం. మొసాద్ ఎంత బలమైనది అయినా అమెరికా నిఘా విభాగం సిఐఏ ఆదేశాలను కూడా పాటిస్తుంది. ఇరాన్ లో ఇప్పుడు నేతన్యాహూ ఆదేశాలతో పాటుగా సిఐఏ ఆదేశాలను సైతం అమలు చేస్తోంది మొసాద్.
ఇజ్రాయిల్ కచ్చితంగా ఇటీవల జరిగిన ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు చెప్పే సమాధానం తీవ్రంగానే ఉండవచ్చు. ఆ సమాధానానికి ఇరాన్ ఏ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుందో అనే ఆందోళన గల్ఫ్ దేశాల్లో కూడా ఉంది. వాస్తవానికి ఇజ్రాయిల్ పై పోరులో ఇరాన్ కు మిత్ర దేశాలు సహకారం అందించే పరిస్థితి లేకపోవచ్చు. ఒక్క రష్యా మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. కాని ఉక్రెయిన్ యుద్దంతో రష్యా నష్టపోయింది. సిరియా, ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ పై పోరులో రష్యాకు తీవ్ర నష్టమే వాటిల్లింది. అందుకే ఇప్పుడు ఇరాన్ ఏ వైపు నుంచి చూసినా ఒంటరిగానే కనపడుతోంది.
ఇరాన్ లో విలువైన ఆయిల్ నిల్వలు, ఖనిజ సంపద ఉంది. ఆ సంపదపై అమెరికాకు ఎప్పటి నుంచో కన్నుంది. ఇప్పుడు అమెరికా తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో సమస్యలను ఎదుర్కొంటోంది. అందుకే వ్యూహాత్మకంగా ఇజ్రాయిల్ ని రంగంలోకి దింపింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం జరిగితే ఇజ్రాయిల్… ఇరాన్ ను ఎంత వరకు ఎదుర్కొంటుంది అనేది కూడా ప్రశ్న. సాంకేతిక పరిజ్ఞానంలో ఇజ్రాయిల్ బలమైనదే అయినా… ఇటీవల ఇరాన్ జరిపిన క్షిపణి దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ఫెయిల్ అయింది.
ఐరన్ డోమ్ దాటుకుని క్షిపణులు ఏకంగా మోసాద్ కేంద్ర కార్యాలయం దగ్గరలో పడ్డాయి. హమాస్ ఎటాక్ తో ఇజ్రాయిల్ ది మేకపోతు గాంభిర్యమే అనేది ప్రపంచానికి క్లారిటీ వచ్చింది. డ్రోన్ ద్వారా దాడుల చేసినా అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ముందుగానే ఇరాన్ సమకూర్చుకుంది. అణుబాంబు తయారీలో కూడా కీలక దశలను ఇరాన్ దాటింది. తేడా జరిగితే ఎంత వరకు అయినా తెగించడానికి ఇరాన్ సిద్దంగా ఉంది. మరి ఈ విషయంలో అగ్ర రాజ్యం ఎంత వరకు తమ మిత్ర దేశం ఇజ్రాయిల్ కు సహకరిస్తుందో చూడాలి. ఏది ఏం జరిగినా ఈ చిచ్చు ఇంకో వందేళ్ళకు కూడా ఆగదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.