ప్రభుత్వాలు ప్రజలకు పథకాల రూపంలో ఇచ్చే సొమ్ము.. పాలకుల సొంత సొమ్ము కాదు.. వాళ్లు రాళ్లు కొట్టి సంపాదించేది కూడా కాదు. పూర్తిగా ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్ము మాత్రమే. ప్రజలంతా నానా తిప్పలు పడి కడుతున్న పన్నులను ప్రభుత్వాలు ఉచితాల రూపంలో పంచుతున్నాయి. మరి వాటిని అయినా బాధ్యతాయుతంగా అవసరమైన వారికే పంచుతున్నారా .. అంటే లేనే లేదు. దేశంలోఎంత మంది జనం ఉంటే అందరూ పేదలే అని చెప్పేలా సర్టిఫికెట్లను రేషన్ కార్డుల రూపంలో ఎప్పటికప్పుడు జారీ చేస్తూనే ఉన్నారు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నా…ఇంకా ఇంకా కావాలని విజ్ఞప్తులు వస్తూనే ఉంటాయి.
90 శాతం కుటుంబాలకు వైట్ రేషన్ కార్డులు
తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి రావడంతో మరో ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే 90 లక్షలకుపైగా రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం మీద కోటి పది లక్షల కుటుంబాలు ఉంటాయని అంచనా. అందులో 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. మరో ఆరున్నర లక్షలు మంజూరు చేస్తున్నారు. అంటే రేషన్ కార్డు లేని కుటుంబాలు మహా అయితే ఓ పది నుంచి ఇరవై లక్షల కుటుంబాలే ఉంటాయి. అంటే దాదాపుగా 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువనే జీవిస్తున్నారా ?
రేషన్ కార్డుల వల్ల ప్రజాధనం అనర్హుల ఖాతాల్లోకి
రేషన్ కార్డు అనేది ఒక్క రేషన్ బియ్యంకోసం కాదు.. అన్ని పథకాలకు అదే ఆధారంగా మారడంతో కాస్త స్థితిమంతులు కూడా రేషన్ కార్డు ఏవో కొన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయన్న కారణంగా తీసుకుంటున్నారు. నిజానికి వీరికి అర్హత ఉండదు. తగినంత సంపాదన ఉంటుంది. అయినా. ప్రభుత్వ ప్రయోజనాలు అందరూ పొందుతున్నారు. అసలైన పేదలకు అందాల్సిన సాయం వీరి ఖాతాల్లోకి కూడా వెళ్తోంది. చాలా మంది ధనవంతులు, మంత్రులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఓ సారి ఏపీలో ఇంటింటికి రేషన్ పథకం ప్రవేశపెట్టినప్పుడు మంత్రి అప్పల్రాజు.. తన ఇంటికి రేషన్ వచ్చిందని గొప్పగా సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. అప్పటికే ఆయన డాక్టర్.. ధనవంతుడు కూడా. మరి రేషన్ కార్డు ఎలా ఉంది?. రేషన్ బియ్యం ఎలా తీసుకున్నారు?.
ఓట్లు పోతాయన్నా భయంతో రేషన్ కార్డుల జోలికి వెళ్లని పార్టీలు
ఆయన మంత్రి కాబట్టి బయట పడ్డారు.. బయటపడని వాళ్లు లక్షల్లో ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ అనర్హులకు ఉన్న రేషన్ కార్డులను తొలగించడానికి దైర్యం చేయలేకతోంది. కుటుంబాల కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నప్పటికీ ఒక్క రేషన్ కార్డు కూడా తొలగించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. అలా తొలగిస్తే ఓట్లు పోతాయని వారి భయం. ప్రజాధనం ఇలా అనర్హుల చేతుల్లోకి రేషన్ కార్డుల వల్లే పోతున్నా.. సంస్కరించాడనికి ప్రభుత్వాలకు ధైర్యం చాలడం లేదు.