ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటరీలో కీలక అధికారి పీవీ రమేష్ పారాసిటమాల్ జపం మాత్రం వదిలి పెట్టడం లేదు. కరోనా నియంత్రణకు ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలను ఆయన మీడియాకు వివరించే బాధ్యత తీసుకున్నారు. ప్రతీ సమావేశంలోనూ పారాసిటమాల్ వాడమనే చెబుతున్నారు. గత వారం ఇలాంటి సలహా ఇవ్వబోయి 650 గ్రాముల పారాసిటమాల్.. ఆరు గంటలకు ఒక్క సారి వేసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో.. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్స్ వచ్చాయి. అంత పారాసిటమాల్ వేసుకుంటే .. కిడ్నీలు ఫెయిలై.. చనిపోతారని విమర్శలు వచ్చాయి. అయితే.. ఆయన చెప్పింది 650 ఎంజీ అని కొంత మంది కవర్ చేశారు. అప్పటికి పారాసిటమాల్‌కు.. కరోనా నియంత్రణకు సంబంధం లేదని.. అవన్నీ ఫేక్ వార్తలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కరోనాను కట్టడి చేయడానికి ఇంత వరకూ ఎలాండి మెడిసిన్ ను కనుక్కోలేకపోయారు. అయితే.. వివిధ రకాల మందులు ప్రయోగించి.. కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో మలేరియాకు వాడే క్లోరో క్విన్ అనే మందు కాస్త ప్రభావం చూపుతోందని… నిర్ణయానికి రావడంతో.. కేంద్రం అధికారికంగా అదే విషయాన్ని ప్రకటించింది. దీంతో పారాసిటమాల్‌పై… ఏపీ ప్రభుత్వం మాట్లాడటం మానేస్తుందని అనుకున్నారు. కానీ పీవీ రమేష్ .. ప్రెస్‌మీట్ పెట్టి.. మళ్లీ.. జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోవాలని సలహా ఇచ్చారు. జ్వరానికి పారాసిటమాల్ ఒక్కటే మందు అన్నట్లుగా చెబుతున్నారు.
పీవీ రమేష్.. పదే పదే పారాసిటమాల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పారాసిటమాల్ లాజిక్‌ను ఆయన సమర్థిస్తున్నారని అందరూ అనుకుంటారు.. కానీ అసలు జగన్ కు ఆ పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ సలహా ఇచ్చింది పీవీరమేషేనని.. ఇప్పుడు అది రివర్స్ అవడం వల్ల… తను చెప్పింది కరెక్టేనని నమ్మించడానికి పీవీ రమేష్ ప్రయత్నిస్తున్నారని సెక్రటేరియట్లో ప్రచారం జరుగుతోంది.