తాము ఎన్డీఏతో లేము… ఇండియా కూటమితోనూ లేము. మా మిత్రులతో ఉన్నామని కేసీఆర్ మహారాష్ట్రలో ప్రకటించారు. అయితే ప్రగతి భవన్ లేకపోతే.. మహారాష్ట్ర అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్న కేసీఆర్.. వరద బాధిత ప్రాంతాల్లో కనీసం పర్యటించలేదు కానీ … మహారాష్ట్రలో రాజకీయానికి మాత్రం వెళ్లారు. అక్కడ రెండు కూటముల్లో తాము లేమని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని నాశనం చేశామన్నారు. అయితే తాము తమ మిత్రులతో కలిసి ఉన్నామని చెప్పారు. కానీ కేసీఆర్ వెంట ఒక్కరంటే ఒక్క మిత్రుడూ కనిపించడం లేదు. చివరికి కుమారస్వామి కూడా కేసీఆర్ కు దూరమయ్యారు.
కేసీఆర్ తన నాయకత్వంలో ప్రత్యేక కూటమి పెట్టాలని అనుకున్నారు. చాలా ప్రయత్నాలు చేశారు. ఓ సారి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రయత్నించారు. రెండో సారి కూడా ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదని ఏకంగా పార్టీ పేరు మార్చి తనదే జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తామని హడావుడి చేసి ఒక్క సారిగా చల్లబడిపోయారు. మహారాష్ట్రలో ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతున్నారు.. అక్కడే పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు బంద్ చేశారు. ఆ పార్టీ వ్యతిరేక సమావేశాలకు వెళ్లడం లేదు. కానీ పార్లమెంట్ లో వ్యతిరేకిస్తామని ప్రకటించారు.
కానీ తరహా రాజకీయం వల్ల ఆయనకు మిత్రులంతా దూరమయ్యారు. కేసీఆర్ తో కలిసి ఉన్న ఒక్క పార్టీ కూడా బయటలేదు. ఆయనతో పిలిస్తే వచ్చి పలకరించే అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, కుమారస్వామి లాంటి వారు దూరమయ్యారు. జగన్ రెడ్డి పార్టీ వైసీపీ మాత్రమే కేసీఆర్ కు దగ్గర అయితే బయటకు చెప్పుకోలేరు. ఆ పార్టీ అనధికారికంగా బీజేపీకి దగ్గర. ఎలా చూసినా కేసీఆర్ చెప్పినట్లుగా ఆయన మిత్రులతో లేరు. అనూహ్యంంగా మార్చుకున్న రాజకీయంతో ఒంటరిగా మిలిగిపోయారు.