హత్య అనే సినిమా తీసి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిపై నిందలు, వారి కుటుంబసభ్యుల క్యారెక్టర్లను దారుణంగా చిత్రీకరించిన వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. వివేకా హత్యలో నేరుగా పాల్గొన్నట్లుగా సీబీఐ నిర్దారించిన సునీల్ యాదవ్ ఇప్పుడు ఆ సినిమాపై పూర్తి స్థాయిలో పోరాడుతున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ సినిమాలో సునీల్ యాదవ్ తల్లిని అత్యంత ఘోరంగా చూపించారు.
ఈ సినిమాలో అవినాష్ రెడ్డి సహా కీలక వ్యక్తుల పాత్రలు లేవు. హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం, సాక్ష్యాలు మాయం చేయడం సహా ఎలాంటి వివరాలు లేవు. దీంతో ఓ ఉద్దేశం ప్రకారం.. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. వివేకానందరెడ్డిని అత్యంత దుర్మార్గుడిగా చూపించారు. ఆయనను చంపినా తప్పు లేదన్నట్లుగా ఓ వైపు.. ఆయనను చంపింది ఆయన కుమార్తె , అల్లుడేనని మరో వైపు సందేశం ఇచ్చేదుకు ప్రయత్నించారు.
ఈ సినిమాకు వైసీపీ నేతలే డబ్బులు పెట్టారని సునీల్ యాదవ్ ఆరోపిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని నిర్మాతగా చూపిస్తున్నారు కానీ డబ్బులు మాత్రం జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు పెట్టారని భావిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు చాలా మంది తెలుగు వాళ్లు ఆసక్తి చూపించలేదేమో కానీ ఇతర భాషల నటుల్నే ఎక్కువగా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకు డబ్బులు ఎవరు పెట్టారో తేలితే .. అది కూడా కేసులో కీలకమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.