తెలంగాణ కొత్త మంత్రివర్గంలో చోటు సంపాదించేందుకు టీఆర్ఎస్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, కేసీఆర్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వారు… తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వారెవరికీ కేసీఆర్ వద్దకు యాక్సెస్ లేనప్పటికీ.. కేటీఆర్‌కు మాత్రం.. తన విజ్ఞానపనలు చేసుకుంటున్నారు. అయితే.. కేసీఆర్ ఇప్పటికే మంత్రివర్గంపై.. శాఖలపై కూడా .. ఓ క్లారిటీకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారికి అవకాశం లేదని.. సీనియర్లకు మాత్రమే చాన్స్ ఉంటుందని… గత మంత్రివర్గం లో ఉండి.. గెలిచిన వారందరికీ చాన్స్ దక్కదని అంటున్నారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల్లో పదిహేను శాతం మందికే మంత్రివర్గంలో చోటు కల్పించాలి. ఆ ప్రకారం.. మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉంది. కేసీఆర్‌ను మినహాయిస్తే పదిహేడు మందికి చాన్స్ ఉంటుంది. ఇప్పటికే మహమూద్ అలీ ప్రమాణం చేశారు కాబట్టి ఇక పదహారు మందికి అవకాశం ఉంది.
జిల్లాల వారీగా.. మంత్రులయ్యేవారి జాబితా ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. ఆదిలాబాద్ నుండి మంత్రులుగా ఉన్న వారిలో ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న గెలిచారు. ఈ సారి జోగు రామన్న పేరు పరిశీలిస్తున్నారు కానీ.. ఇంద్రకరణ్ రెడ్డికి అవకాశం లేదని తేలిపోయింది. మరో స్థానం రేఖానాయక్ , బాల్క సుమన్ లలో ఒకరికి ఇస్తారంటున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. కేసీఆర్ పగ్గాలు కేటీఆర్‌కు అప్పగిస్తారు కాబట్టి.. బాల్క సుమన్‌కు అప్పడు మంత్రి పదవి ఇస్తారని.. ఇప్పటికి రేఖానాయక్‌కు చాన్సివ్వవొచ్చని చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సారి కొప్పుల ఈశ్వర్‌కు ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. ఈటల రాజేందర్ కు.. స్పీకర్ పదవి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్యానాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కడియం శ్రీహరికి ఈ సారికి చాన్స్ లేనట్లేనంటున్నారు. నల్గొండ జిల్లా నుండి ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డికి మంత్రియోగం ఖాయని చెబుతున్నారు. ఎన్నికల్లో ఆయన తెర వెనుక కీలక పాత్ర పోషించారు. ఇక మంత్రి పదవి తన జీవితాశయం అని చెప్పుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆలేరు నుంచి మరోసారి గెలిచిన గొంగడి సునీత పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
సహజంగా.. జెయింట్ కిల్లర్‌గా… అవతరించిన వారికి.. మంత్రి పదవులు దక్కుతూ ఉంటాయి. ఆ జాబితాలోకి పట్నం నరేందర్ రెడ్డి వచ్చే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన సోదరుడు… మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి ఓడిపోయారు. రేవంత్ రెడ్డిని ఓడించడం.. పట్నం బ్రదర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి కేసీఆర్.. నరేందర్ రెడ్డిని మంత్రిని చేస్తారంటున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి పోచారం పదవి రెన్యూవల్ అయ్యే అవకాశం ఉందని.. చెబుతున్నారు. బాల్కొండ నుంచి గెలిచిన ప్రశాంత్ రెడ్డికి ఛాన్స్ దక్కవచ్చు. కేసీఆర్‌కు ప్రశాంత్ రెడ్డి సన్నిహితుడు. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. ఈ సారి ఖాయమే. ఆయన కేటీఆర్‌కు కూడా స్నేహితుడు. గ్రేటర్లో మాత్రమే చిక్కుముడి పడింది. తలసానికి చాన్సిస్తారా దానం వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవులు రాని వారికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులతో సంతృప్తి పరిచే అవకాశం ఉంది.