తెలంగాణ బీజేపీలో చేరి రాజకీయంగా బాగుపడాలని ఆశపడిన వాళ్లందరూ షెడ్డుకెళ్లిపోయారు. మళ్లీ బయట కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా చెలామణి అయి మంచి గుర్తింపు తెచ్చుకున్న నేత అయిన నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడెక్కడున్నారో తెలుసా ? చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఫేడవుట్ అయిపోయారు. బీజేపీలో చేరిన తర్వాతే ఆయనకీ పరిస్థితి వచ్చింది. చివరికి గుర్తించి బయటకు వచ్చినా ప్రయోజనం లేకపోయింది.
బీజేపీలో చేరి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చి బయటకు వచ్చినా మల్లీ వెలుగులోకి రాని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. మోత్కుపల్లి నర్సింహులు , పెద్ది రెడ్డి ..సహా చాలా మంది ఉన్నారు. వారిలో చాలా మంది బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇతర పార్టీల్లో చేరినా వారికి గుర్తింపు లేదు. గతంలో వారికి ఉన్న ఇమేజ్ మొత్తం బీజేపీ పాలబడటంతో వారికి కొత్త పార్టీల్లోనూ పెద్దగా చాన్స్ లభించడం లేదు. వారి వల్ల బీజేపీకి లాభం కానీ నష్టం కానీ ఉండటం లలేదు. కానీ చేరిన వాళ్లు మాత్రం రాజకీయంగా భవిష్యత్‌ను కోల్పోతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి మంచి పోస్టులు ఇస్తున్నారు. అస్సాం లాంటి చోట్ల సీఎం పదవులు కూడా ఇచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం ఎవరూ నిలదొక్కుకోలేకపోతున్నారు. ఈటల రాజేందర్..తప్పని పరిస్థితుల్లో అస్తిత్వం కాపాడుకోవడానికి బీజేపీలో చేరక తప్పలేదు. కానీ అక్కడ ఆయన ఇమడగలుగుతున్నారా అంటే.. గట్టిగా ఔను అని చెప్పలేని పరిస్థితి. ఈటలతో ప్రారంభించి ఇటీవలి కాలంలో చేరిన వారందరి పరిస్థితి అదే. అందుకే బయటకు వస్తున్నారు. కానీ అప్పటికే వారి రాజకీయం క్లోజ్ అయిపోయి ఉంటుంది. తెలంగాణ బీజేపీలో చేరి బాగుపడిన ఒక్క బయటి నేత కూడా లేకపోవడమే దీనికి సాక్ష్యం.