తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నా. .. రాజకీయ చాణక్యం ద్వారా వాటిని ఆయన చక్కబెట్టుకోగలరు. కానీ.. పాలనలో ఎదుర్కొంటున్న సవాళ్లు మాత్రం.. ఆయనకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేత, ధరణి విధానం అలాగే.. ఎల్ఆర్ఎస్తో కేసీఆర్ ప్రజల వైపు అనే ఇమేజ్ మసకబారే ప్రమాదం ఏర్పడింది. ఈ మూడు కూడా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్థిక భారాన్ని కల్పిస్తున్నాయి. కేసీఆర్ ప్రజలను దోచుకోవడానికే ఇవి తెచ్చారన్న అభిప్రాయమూ ప్రజల్లో బలపడుతోంది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్లో ఈ నిర్ణయాలకు కారణం ఎవరన్న చర్చ జరుగుతోంది.
ఏ ప్రభుత్వం .. సీఎం అధికారంలో ఉన్నా.. వారు.. కొంత మంది సీనియర్ అధికారులపై ఆధారపడాల్సిందే. సీఎం ఆలోచనలకు అనుగుణంగా వారు పరిపాలనా నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుంది. కొంత మంది పరిధి దాటి తమ ఆలోచనలు అమలు చేసేలా.. పాలకుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం.. తెలంగాణలో కొంత మంది అధికారులు కేసీఆర్ కోటరీగా ఏర్పడి ఆయనకు సలహాలిస్తున్నారని ఆ ప్రకారమే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ధరణి అమల్లోకి తేవడం.. తక్షణం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం… అదే సమయంలోఎల్ఆర్ఎస్ తేవడం… ఓ అధికారి ఆలోచన అని చెబుతున్నారు. అలా చేస్తే.. భూసమస్యలు పరిష్కారమై ప్రజలు ఆనందంలో ఉంటారని.. ఎల్ఆర్ఎస్ కట్టడానికి వెనుకాడరని కేసీఆర్ ను ఒప్పించినట్లుగా చెబుతున్నారు.
కానీ ఆచరణలో పరిస్థితి తిరగబడింది. రిజిస్ట్రేషన్లు మూడు నెలల నుంచి లేవు. దీంతో అమ్మకాలు, కొనుగోళ్లు ఆగిపోయి ప్రజలు ఇబ్బందిపడ్డారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. అదే సమయంలో.. కొత్త విధానం లేనిపోని సమస్యలు తెచ్చింది. న్యాయవివాదాల్లో చిక్కుకుంది. చివరికి పాత విధానంతోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఎల్ఆర్ఎస్ సమస్య అలాగే ఉంది. టీఆర్ఎస్ ఓడిస్తే ఎల్ఆర్ఎస్ రద్దవుతుందన్న ప్రచారాన్ని విపక్షాలు చేస్తున్నాయి. దాదాపుగా ఇరవై వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేస్తోందని.. ఎల్ఆర్ఎస్ ద్వారా ఖాళీ స్థలాలలను గుర్తించి పన్నులేస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పన్నులు బాదేస్తున్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.
మొత్తానికి కేసీఆర్ పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అయినట్లయింది. ఇప్పుడు.. వాటినుంచి ఎలా బయటకు రావాలా అని టీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోకపోతే… తమపై వ్యతిరేకత మొత్తానికే పెరిగిపోతుందన్న ఆందోళనలో వారున్నట్లుగా చెబుతున్నారు.