డ్రగ్స్ కేసులో వాళ్లంతా దొరికారు.. కానీ వారు డ్రగ్స్ అడిక్ట్ అయ్యామని డీ అడిక్షన్ సెంటర్లకు వెళ్లారు. ఏడాది పాటు ట్రీట్ మెంట్ తీసుకున్నారు. తర్వాత డ్రగ్స్ బానిసత్వం నుంచి బయటపడ్డామని సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. దాన్ని కోర్టులో సమర్పించి కేసుల నుంచి బయటపడ్డారు. ఇలా కోర్టు నుంచి ఇమ్యూనిటీ పొందిన వారు ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 250 మంది. వీరంతా ఎవరు అన్న వివరాలు బయటకు రాలేదు కానీ… కోర్టు నుంచి నేరుగా ఊరట పొందారంటే.. అదీ కూడా విషయం బయటకు రాకుండా చూసుకోగలిగాలంటే ప్రముఖులేనని భావిస్తున్నారు.
ఈ 250మందిలో సినీ , వ్యాపార ప్రముఖులు ఉన్నట్లుగా భావిస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్న సమయంలో… ఎందుకైనా మంచిదని దొరికిపోయిన ప్రముఖులు ఇలా చట్టబద్దంగా డి అడిక్షన్ సెంటర్ల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుని కామ్‌గా బయటపడినట్లుగా భావిస్తున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ మళ్లీ ప్రారంభించబోతున్న సందర్భంలో ఈ విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు .
హైదరాబాద్‌లో చాప కింద నీరులా డ్రగ్స్ వ్యాపారం సాగుతోందని నమ్ముతున్న ఆయన ఎక్కడిక్కడ కట్ చేయాలని నిర్ణయించుకన్నారు . అందుకే కీలక విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. పెద్ద పెద్ద స్మగ్లర్లను అరెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంగా డ్రగ్స్‌కు అలవాటు పడిన సినీ ప్రముఖులకు కూడా టెన్షన్ ఏర్పడుతోంది. సీవీ ఆనంద్ పట్టుదల చూస్తూంటే హైదరాబాద్ డ్రగ్స్ కేసుల్లో ముందు ముందు మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉంది.