విధేయులుగా ఉండాల్సిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. ధిక్కార స్వరాన్ని వినిపిస్తే.. అధినేతకు ఆగ్రహం రావడంలో ఆశ్చర్యం లేదు. అదే రీతిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం నాడు నిర్వహించిన సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనను బాగా చికాకు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి జగన్ నిర్వహించిన సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైతే.. వచ్చిన వారిలోనూ ఇద్దరు జగన్ మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
జగన్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించినప్పుడు మధ్యలో ఆయన అసహనానికి గురయ్యారని, సమావేశంనుంచి అర్థంతరంగా వెళ్లిపోయారని మాత్రం వార్తలు వచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం, వారితో సఖ్యతగా ఉండడం గురించి, వారికి దన్నుగా ఉండడం గురించి ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వబోయినప్పుడు ఆయనకు కోపం వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు కోపం తెప్పించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరంటే నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కావలి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అని తెలుస్తోంది
తొలుత శ్రీనివాసరెడ్డి, జగన్‌కు సలహాలు చెప్పడం ప్రారంభించాడని, ఒక రకంగా జగన్‌ను నిలదీసినట్లుగానే ఆయన మాట్లాడుతుండగా జగన్‌కు కోపం వచ్చిందని అంటున్నారు. జగన్‌ను ఆయనను అడ్డుకునే సమయానికి, ప్రతాప్‌కుమార్ రెడ్డి కూడా లేచి జగన్ ధోరణి మీదనే మాటలు అన్నట్లు సమాచారం. దాంతో జగన్‌కు కోపం వచ్చి వెళ్లిపోయారని చెప్పుకుంటున్నారు. కానీ తమ పార్టీ నేత వారితో కూడా సఖ్యంగా మెలగి, పార్టీ లోపాల గురించి అంతర్గత వేదికల మీద మాట్లాడుకునేలా పార్టీని కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.