తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే .. తాము చేసే ఉద్యమంలో ప్రజలు ఇబ్బంది పడితే దానికి బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్యోగ సంఘం నేతల్లో ఒకరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఆయన ఈ నెల 25 తేదీని డెడ్ లైన్ గా పెట్టారు. ఈ లోపు ప్రభుత్వం.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించాల్సిందేనంటున్నారు. లేకపోతే ఉద్యమం తప్పని అంటున్నారు.
ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకున్నా ఇంత వరకు ఓపికతోనే భరించామని, ఇక భరించలేమని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెబుతున్నారు. దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి… ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పెడుతోందని ఆయన ప్రశ్నిస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం డబ్బులు మాకు చెల్లించండి మహాప్రభో అని వేడుకుంటున్నా ఇవ్వడం లేదని చివరికి ఆడపిల్లలు పెళ్లిళ్లు కూడా వాయిదాలు వేసుకుంటున్నారని ఆయనంటున్నారు. అనారోగ్యానికి గురైతే చికిత్స తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. స్కూల్ పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారని అంటున్నారు.
తప్పని సరిపరిస్దితులలో ఉద్యోగులుగా చేపట్టే, న్యాయమైన ఉద్యమానికి, ప్రజలు,ప్రజా సంఘాలు మద్దతు కావాలని బొప్పరాజు కోరుతున్నారు. ఈ నెల 26 న కలిసొచ్చే ఇతర సంఘాలు..జేఏసీ లను కలుపుకుని, భవిష్యత్ ఆందోళన కార్రక్రమాల షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఆయనంటున్నారు. బొప్పరాజు కాస్త ఘాటు ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ఆయన తోటి ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం.. సీఎం జగన్ కు ఎక్కడ ఇబ్బంది ఎదురవుతుందోనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు.
గతంలో ఇలా అన్ని వర్గాలూ మద్దతివ్వడంతో భారీ ఉద్యమం జరిగింది. చివరికి ఉద్యోగ నేతలు .. ప్రభుత్వంతో రాజీ పడిపోయి.. టీచర్లను సైతం ముంచేశారు. వారు మాత్రం భారీగా లాభం పొందారన్న ఆరోపణలు వచ్చారు. ఇప్పుడు బొప్పరాజు కూడా అందర్నీ కలుపుకుని చివరికి ఉద్యమం అమ్మేయరన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్నలు ఇప్పుడు రావడానికి అదే కారణం.