హైదరాబాద్ మేడ్చల్ దగ్గర తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఓ పెద్ద ఫామ్ హౌస్ ఉంది. పాతిక ఎకరాల వరకూ ఉండే ఆ ఫామ్ హౌస్ కు జేజే గార్డెన్ అనే పేరు నిన్నా మొన్నటి వరకూ ఉండేది. కానీ ఇప్పుడు దాని పేరు మారిపోయింది. శ్రీ దుర్గా ఇన్ ఫ్రా డెవలపర్స్ అనే కంపెనీకి చెందిన ఆస్తి అనే బోర్డు వెలిసింది. ఆ దారిన పోయే వాళ్లు మారిపోయిన బోర్డును ఆశ్చర్యంగా చూస్తున్నారు. జయలలిత ఫామ్ హౌస్‌ను కొనేసిన ఆ కంపెనీ ఎవరిది అని ఆసక్తిగా చూడటం ప్రారంభించారు.
శ్రీ దుర్గా ఇన్ ఫ్రా డెవలపర్స్ అనే కంపెనీ.. పధ్నాలుగు నెలల కిందటే ప్రారంభించారు. రూ. లక్ష మూలధనంతో ప్రారంభమైన కంపెనీలో నవనీత్ గణేష్, నవనీత్ దశరథ్ అనే సోదరులు డైరక్టర్లుగా ఉన్నారు. ఈ పధ్నాలుగు నెలల కాలంలో ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. ఈ కంకెనీకి వెబ్ సైట్ కూడా లేదు. కానీ సాయి దుర్గా బిల్డర్స్ అండ్ డెలవపర్స్ పేరుతో ఇంకో కంపెనీ ఉంది. ఆ కంపెనీ నిర్మాణ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంది. కానీ జయలలిత ఫామ్ హౌస్ కొన్ని శ్రీ దుర్గా ఇన్ ఫ్రా కు.. సాయిదుర్గా బిల్డర్స్‌కు సంబంధం లేదు . అంటే… కంపెనీని ప్రారంభించిన అనతి కాలంలోనే జయలలిత ఫామ్ హౌస్‌ను కొనేశారన్నమాట. అందుకే వాళ్లెవరు అన్న డౌట్ చాలా మందికి వస్తోంది.
జయలలితకు వారసులు లేరు. ఆమె అవివాహిత. అందుకే ఆమె తదనంతరం ఆస్తులన్నీ జయలలిత అన్న సంతానం అయిన దీప, దీపక్‌లకు చెందుతాయని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు వారు తమకు లభించిన ఆస్తులను అమ్ముకుంటున్నట్లుగా తెలుస్తోంది. వారి నుంచి హైదరాబాద్‌కు చెందిన కంపెనీ కొనుగోలు చేసింది. ఏదైనా ఓ ప్రముఖ కంపెనీ కొనుగోలు చేసి ఉంటే ఇంత చర్చ జరిగేదేమో కాదు కానీ.. ఊరూపేరూ లేని కంపెనీ.. వందల కోట్ల విలువ ఉండే జయలలిత ఫామ్ హౌస్‌ను కొనుగోలు చేయడంపైనే చర్చ జరుగుతోంది.