ఏపీలో కొత్త రేట్ల జీవో వచ్చేసింది. గ్రామ పంచాయతీ, నగర పంచాయితీ, మున్సిపాటిటీ… ఇలా ఏరియాలను బట్టి టికెట్ రేట్లు పెంచారు. స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్సులకు మరో రేటు. ఈ రేట్లు సంతృప్తికరంగా ఉన్నాయా, లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే, గత జీవో కంటే, కాస్త నయం అనిపించే ధరలే ఇవి. 5వ ఆటకు అనుమతి ఇవ్వడం మరో సానుకూలాంశం. అయితే… పెద్ద సినిమాల విషయానికొస్తే, హీరో, దర్శకుడి పారితోషికాలు మినహాయించి వంద కోట్లు అయిన చిత్రాలకే వెసులు బాటు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అదే అసలు మెలిక. అసలు రేట్లు పెంచమని పోరాడుతున్నవాళ్లంతా పెద్ద నిర్మాతలే. అవన్నీ వందల కోట్ల సినిమాలే. ఇప్పుడు అవన్నీ తమ బడ్జెట్ ఎంతయ్యిందో లెక్క చెప్పాలి. హీరో, దర్శకుడి పారితోషికాల్ని మినహాయించి లెక్కలు అప్పజెప్పాలి. ఇది అంత సులభంగా తేలే విషయం కాదు.
ఓ సినిమా బడ్జెట్ ఇంత అయ్యిందని నిర్ణయించేవారు ఎవరు? నిర్దారించే వారు ఎవరు? అసలు బడ్జెట్ ని ఎలా లెక్కగడతారు? అనేవి కొత్త ప్రశ్నలు. ఉదాహరణకు `రాధే శ్యామ్` సినిమానే తీసుకుందాం. ఈ సినిమాని బడ్జెట్ రూ.300కోట్లు అంటున్నారు. ప్రభాస్ కి ఇచ్చిన పారితోషికం వంద కోట్లు అనుకుంటే అది బడ్జెట్లో లెక్క పెట్టకూడదు. పారితోషికాలు మినహాయించుకుంటే రూ.150 కోట్ల సినిమా అనుకుందాం. మరి దాన్ని లెక్కగట్టేది ఎవరు? రూ.3 కోట్ల సెట్ వేసి, ఆ సెట్ కి రూ.30 కోట్లు అయ్యిందని చెప్పి, బడ్జెట్లు పెంచుకుంటూ వెళ్లిపోయి, దాన్ని వంద కోట్ల సినిమాగా మలిచి, రేట్లు పెంచుకుంటే సరిపోతుందా? అలాంటి ఆలోచనల్ని ప్రభుత్వం ఆపగలదా? ప్రతీ సినిమాకీ అయ్యే ఖర్చుని సరిగ్గా ఎలా అంచనా వేయగలరు? సినిమా సినిమాకీ ఓ ఆడిటర్ని నియమిస్తారా?
బడ్జెట్లో హీరో, దర్శకుడి పారితోషికం లెక్కగట్టకూడదు అన్నది సహేతుకమైన నిబంధన అనిపించడం లేదు. హీరో స్థాయిని బట్టే సినిమా తయారవుతుంది. ప్రభాస్ వంద కోట్ల హీరో. ఇప్పుడు మారుతితో సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాకి ప్రభాస్ పారితోషికాన్ని పక్కన పెడితే.. వంద కోట్ల ఖర్చు అవ్వదు. మహా అయితే.. 50 కోట్ల సినిమా అవుతుంది. అంటే… అది పెద్ద సినిమాల లెక్కలోకి రాదు. రూ.150 కోట్ల సినిమాని పెద్ద సినిమా అనుకోకూడదు అని చెప్పడం.. హాస్యాస్పదం. ఈ విషయమై.. రాంగోపాల్ వర్మ కూడా చాలాసార్లు గొంతు చించుకున్నాడు. హీరో పారితోషికం కూడా బడ్జెట్లో భాగమే అని… బల్ల గుద్ది మరీ చెప్పాడు. మంత్రులతో వర్మ భేటీలో కూడా ఇదే విషయం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. కానీ ప్రభుత్వం ఇప్పుడు పాత పాటే పాడింది. పెద్ద హీరోల్ని నమ్ముకుని తీసే నిర్మాతలు.. ఇప్పుడు ఈ విషయంలో మరోసారి నిరసన వ్యక్తం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.