పేరుకే గ్రేటర్ హైదరాబాద్. మహానగరం… కానీ ఈ నగరం పరిస్థితి మేడిపండు చందంగా తయారైంది. మేడిపండు చూడు మేలిమై ఉండు… పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్లు, హైదరాబాద్ లో డ్రైనేజీ.. పరిశుభ్రత చూస్తే ఎంత డొల్లతనం ఉందో బయటపడుతుంది.
నగరంలో రెండ్రోజుల వర్షానికి అంతా ఆగమాగం. ఎక్కడ డ్రైనేజీ పొంగుతుందో… ఎక్కడ నీరు ఆగిపోయిందో తెలియదు. సాధారణంగా సీజనల్ వ్యాధులు, దోమల కారణంగా వచ్చే వ్యాధులు ఎక్కువగా ఏజెన్సీ ఏరియాల్లో నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మరణాలు అంతే స్థాయిలో ఉంటాయి.
గత 20రోజుల్లో హైదరాబాద్ లో జ్వరాలు, డెంగ్యూ సహ ఇతర కేసుల సంఖ్య 30శాతం పెరిగింది. దోమల నివారణకు పక్కాగా ప్రణాళికలు లేకపోవటం, ఉన్నా అమలుకు నోచుకోకపోవటం ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో గతంలో ఏకకాలంలో జ్వర సర్వే చేసేవారు. ఇప్పుడు అలాంటివి ఏవీ కనపడటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే మున్సిపల్ శాఖ ఉన్నా… రివ్యూ లేదు. ఆరోగ్య శాఖ మంత్రి చర్యలు అంతంతే. ఇక తప్పని పరిస్థితుల్లో జీహెచ్ఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ ఇప్పుడు ఇచ్చారు.
గతంలో వర్షాలు పడుతున్నాయంటే మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు, అధికారులు రోడ్లపై ఉండేవారు. శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించే వారు. కానీ, ఇప్పుడేమైందో… ఎవ్వరికీ పట్టడం లేదు. ప్రజలంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
కానీ, ఇదే పరిస్థితి… ఇదే నిర్లక్ష్యం కొనసాగితే… అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావటం ఖాయంగా కనిపిస్తోంది.