మునుగోడు నియోజకవర్గంలోకి డబ్బు, మద్యం ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి నియంత్రణకు పెద్ద ఎత్తున పోలీసుల్ని వినియోగిస్తున్నారు. పోలీసులు కూడా పట్టుకుంటున్నారు. కానీ.. దొరుకుతోంది మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన డబ్బులే. టీఆర్ఎస్ నేతల వద్ద పైసా దొరకడం లేదు. రెండు రోజుల కిందట ఓ బీజేపీ లీడర్ కారులో రూ.కోటి పట్టుకున్నట్లు పోలీసులు ప్రకారం. తరవాత రోజు ఓ కాంగ్రెస్ నేత కారు నుంచి రూ.19 లక్షలు సీజ్ చేసినట్లు చెప్పారు. పలు చోట్ల నగదు పట్టుకుంటున్నారు. వీరిలో టీఆర్ఎస్ నేతల పేర్లు ఉండటం లేదు.
డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీస్, రెవెన్యూ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఏడు సర్వైలెన్స్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. ఒక్కో గ్రామంలో ఎస్ఐ, పది మంది సిబ్బందిని కేటాయించారు. 24 గంటలపాటు పనిచేసేలా 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరో 16 ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్), 14 ఫ్లయింగ్ స్క్వాడ్(ఎఫ్ఎస్),7 వీఎస్(వీడియో సర్వైలెన్స్), 18 ఎస్ఎస్టీ(స్టాటిస్టిక్సర్వైలెన్స్ టీమ్)లను రంగంలోకి దించినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే వీరెవరికీ టీఆర్ఎస్ నేతల దగ్గర డబ్బు కానీ మద్యంకానీ దొరకడం లేదు.
బీజేపీ నేతకు చెందన కారులో ఉన్న రూ. కోటిని విజయవాడలో పట్టుకున్నారని బీజేపీ నేతలంటున్నారు. అక్కడ పట్టుకుని మునుగోడులో పట్టుకున్నట్లుగా చెబుతున్నారని.. దీనికి ఏపీ పోలీసులు సహకారం అందించారని చెబుతున్నారు. విజయవాడ నుంచి మునుగోడుకు చేరే వరకూ ఉన్న చెక్ పోస్టుల్లో సీసీ కెమెరా దృశ్యాలు బయట పెట్టాలని బీజేపీ నేతలంటున్నారు. అధికార పార్టీ నుంచి 15 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలంతా మునుగోడులో ఉన్నారు. కోట్లు కుమ్మరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేతల వాహనాలు కూడా తనిఖీలు చేయడం లేదంటున్నారు.