తెలంగాణ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో ఐదో తేదీన చెబుతానని.. ప్రత్యేకంగా ఎవరూ అడగకపోయినా.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఉత్కంఠ రేపిన పవన్ కల్యాణ్.. చివరికి ఏం చెప్పారో ఎవరికీ అర్థం కాలేదు. తాను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేదో… సంజాయిషీ ఇచ్చుకుని… నీతి వాక్యాలు చెప్పారు. ముందస్తు ఎన్నికలు రావడంతో మేం పోటీ చేయలేదని …పారదర్శకత, మంచి పాలన అందించిన వారికి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందివ్వగలరో.. వారికే ప్రజలు ఓటు వేయాలని ఆయన సూచించారు ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ తెచ్చుకున్న యువత అదే స్ఫూర్తితో పనిచేయండని హితబోధ పలికారు. తెలంగాణ ఇచ్చామని, తెచ్చామనే వాళ్లు, పెంచామనే వాళ్ల మధ్య…ఎవరికి ఓటేయాలన్న అయోమయ పరిస్థితి ఉందన్నారు. బహుశా అందుకే కావొచ్చు.. తన అభిమానులకు ఎవరికి ఓటు వేయాలో స్పష్టంగా చెప్పలేదు. ధనాన్ని దాచుకోవచ్చు కానీ… తేజస్సును దాచలేరన్న సూక్తి కూడా చెప్పలేదు. తెలంగాణ ఎన్నికలకు.. దీనికి ఎలా సూటయిందో కానీ పవన్ కల్యాణ్ మాత్రం అదే చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో… తన మద్దతు ఎవరికో చెబుతానంటూ… ఊరించడంతో.. ఏ పార్టీకైనా మద్దతు ప్రకటిస్తారేమోనని అందరూ ఎదురు చూశారు.
ఈ మాత్రం చెప్పడానికి.. ఐదో తేదీ వరకు చూడాలని టీజర్ ఎందుకు రిలీజ్ చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. తనకు పోటీ చేసే విషయంలోనే కాదు.. ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వాలో క్లారిటీ లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తాను ఎవరికో ఒకరికి మద్దతు ఇస్తానని పదే పదే చెప్పినా… చివరికి.. సందేశంతో సరిపెట్టారు. బీఎల్ఎఫ్ అభ్యర్థులు తమకు పవన్ కల్యాణ్ మద్దతిస్తారేమో అని ఆశ పడ్డారు. కానీ పవన్ కల్యాణ్ ఆ ధైర్యం కూడా చేయలేదు.