హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ అధిష్టానం రెండురోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది. ప్రస్తుతం కంభంపాటి హరిబాబు ఈ పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్ష పదవికి సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి రేసులో ఉన్నారు. సోము వీర్రాజు కాపు సామాజికవర్గం కాగా, పురందేశ్వరి కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికపై మిత్రపక్షం తెలుగుదేశం ప్రభావం కూడా ఉంటుందనే వాదన ప్రచారంలో ఉంది. చంద్రబాబు నాయుడుకు వీర్రాజు, పురందేశ్వరి ఇద్దరూ ఇష్టం లేదని అంటున్నారు. వెంకయ్య నాయుడు ద్వారా తమ సామాజికవర్గానికే చెందిన యడ్లపాటి రఘునాథబాబునుగానీ, జమ్ముల శ్యామ్ కిషోర్‌ను గానీ ఎంపిక చేయించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే వీర్రాజుకు తూర్పు గోదావరి జిల్లాకే చెందిన బీజేపీ కీలక నాయకుడు రామ్ మాధవ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆశీస్సులున్నట్లు తెలుస్తోంది. మరి వెంకయ్యనాయుడు మాట చెల్లుతుందా, అమిత్ షా-రామ్ మాధవ్ నిర్ణయమే శిరోధార్యమవుతుందా అనేది వేచి చూడాలి. కానీ సోము వీర్రాజుకు నోటి దురుసు ఎక్కువవటం మైనస్ పాయింట్ అని అంటున్నారు. ఇదిలాఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి కూడా రెండు రోజుల్లో ఎంపిక జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి రేసులో ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు ఇవాళ ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ రాజమండ్రిలో జరిగింది. పార్టీ అగ్రనేతలు హరిబాబు, వీర్రాజు, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. మార్చ్ 6న ‘ఏపీ అభివృద్ధి-బీజేపీ లక్ష్యం’ పేరుతో జరపబోయే బహిరంగసభ గురించి కూడా చర్చిస్తున్నారు.