అగ్రిగోల్డ్ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన వైస్ ఛైర్మన్ అవ్వా సీతారామారావును సీఐడీ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆచూకీ తెలియకుండా పోయిన ఆయన్ని, గురుగ్రామ్ లోని ఒక భవనంలో అరెస్టు చేశారు. గత సోమవారం అరెస్ట్ అయిన ఆయన్ని గత మంగళవారమే విజయవాడకు తరలించారు. ఆయన్ని పట్టుకోవడం కోసం చాలా కష్టపడ్డామనీ, అతి కష్టమ్మీద ఆచూకీ దొరకబట్టామని సీఐడీ చెప్పుకొచ్చింది. అయితే, ఈయన అరెస్టు వెనక… చాలా కథ నడిచిందని ఉన్నతాధికారుల వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం! ఈ కేసు నుంచి సీతారామారావును కాపాడే ప్రయత్నం కూడా ఆ స్థాయి వర్గాల్లోనే జరిగిందన్న అంశం ఇప్పుడు చర్చనీయం అవుతోందట..!
2016లో, దాదాపు 40 లక్షల మంది డిపాజిటర్ల నుంచి సొమ్ము వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలు అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావుపై వచ్చాయి. ఆ సమయంలో రామారావుతోపాటు ఎండీ శేషును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం ఛైర్మన్ సోదరుడైన ఈ సీతారామారావు కోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసును వాదించారు. కానీ, కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. అప్పట్నుంచీ ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. సీఐడీ వెతకడం మొదలుపెట్టింది. కానీ, అదే సీఐడీకి చెందిన ఇద్దరు సీనియర్ ఉన్నతాధికారులు సీతారామారావుకు సాయం చేయడం మొదలుపెట్టారట..! విచిత్రం ఏంటంటే.. ఆయన ఎక్కడున్నారో సదరు అధికారులకు తెలిసినా, ఆ విషయం చెప్పకుండా ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టించేలా వ్యవహరించారట. సో… ఇన్నాళ్లూ ఆయన్ని వారే కాపాడుకుంటూ వచ్చినట్టు ఇప్పుడు గుప్పుమంటోంది..! చివరికి ఢిల్లీలో సీతారామారావును అత్యంత కష్టసాధ్యంగా పట్టుకున్నామని మీడియా ముందు సీఐడీ బిల్డప్ ఇచ్చింది. మరి, ఏ ప్రయోజనం లేకుండా సీతారామారావుకు ఎందుకు సాయపడతారండీ..? ఉంది.. ఆ ఇద్దరిలో ఒకరు అలాంటి సాయమే పొందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకరికి చేవెళ్ల సమీపంలో ఓ ఐదు ఎకరాల ఫామ్ హౌస్ ను సీతారామారావు బహుమానంగా ఇచ్చారట!
అగ్రిగోల్డ్ భూముల వేలంను తనకు లాభదాయంగా మార్చుకునే ప్రయత్నం ఓ అధికారి చేస్తున్నారట..! చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ నాయుడు అనే వ్యక్తి అగ్రిగోల్డ్ భూముల వేలంలో ఓ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. దాన్ని రిలీజ్ చేయాలంటే రూ. 2 కోట్లు తనకు కావాలంటూ ఇటీవలే ఐజీ నుంచి అడిషనల్ డీజీగా పదోన్నతి పొందిన నార్త్ ఇండియన్ అధికారి ఒకరు డిమాండ్ చేస్తున్నారట! ఈయనకి సీతారామారావుతో మాంచి దోస్తీ ఉందని సమాచారం. అయితే, చట్టప్రకారం తాను వేలంలో పొందిన భూమిని దక్కించుకోవడం కోసం రూ. 2 కోట్లు ఎందుకివ్వాలనే ఆవేదనతో విశ్వనాథ నాయుడు ఉన్నారట. ఈ ఆవేదనతోనే ఆయన ఓ సీనియర్ అధికారిని కలిసి… తన గోడును వెళ్లగక్కుకుని, ఫిర్యాదు చేశారు. చివరికి ఈ విషయం ముఖ్యమంత్రి వరకూ చేరిపోయిందనీ, ఆ అధికారిని పిలిచి క్లాస్ తీసుకున్నారనీ తెలుస్తోంది. సో.. ప్రస్తుతం ఐపీఎస్ వర్గాల్లో ఇవే టాపిక్స్ మీద చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.