వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆడియో టేపులు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. మొదట ఫృధ్వీ తర్వాత అంబటి రాంబాబు ఇప్పుడు అవంతి శ్రీనివాస్. అందరూ ఆడవాళ్లతో తప్పుడు ప్రవర్తనకు సంబంధించి ఆడియో సాక్ష్యాలతో సహా దొరికిపోయినవారే. వీరెవరూ కూడా ధైర్యంగా తప్పు మాది కాదు అని చెప్పుకోలేకపోగా … టీడీపీ చేసిన కుట్ర అని కానీ ప్రతిపక్షాలు ట్రాప్ చేశాయని కానీ గట్టిగా వాదించలేకపోయారు. అసలు ఆ కోణంలో ఆరోపణలు కూడా చేయలేదు. ఎందుకంటే వారికి తెర వెనుక ఏం జరిగిందో తెలిసి ఉంటుందని ఓ అభిప్రాయానికి రావొచ్చు.
టార్గెటెడ్‌గా ఆడియోలు సోషల్ మీడియాలో లీక్..!
ఎస్వీబీసీ చైర్మన్‌గా సినీ నటుడు ఫృధ్వీ ఉఓ ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ ఆడియోటేపులు బయటకు రావడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన తాను నమ్మిన వాళ్లు… తాను కెరీర్నుసైతం త్యాగం చేసి పని చేసిన వాళ్లే తనను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశాడు. సందర్భం వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నారు. ఆయన ఉద్దేశం సొంత పార్టీలోనే కుట్ర జరిగిందని. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆవేదన కూడా అచ్చంగా ఇలాంటిదే. బయటకు వచ్చిన ఆడియో టేపులు ఆయనవే అని చెప్పేలా ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. ఆయన ప్రతిపక్షాల కుట్రఅని ఆరోపించలేదు కానీ.. సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని.. ఎదుర్కొంటానన్న అర్థంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్ వంతు వచ్చింది. ఆయన కూడా తన రాజకీయ ఎదుగుదల చూసి కుట్ర చేశారని అంటున్నారు కానీ.. ప్రతిపక్షాలనడం లేదు. సొంత పార్టీ నేతలేనని ఆయనకు కూడా గట్టి నమ్మకం ఉన్నట్లుగా ఉంది.
“రికార్డులు” చేయగల సామర్థ్యం ఉండేది ప్రభుత్వానికే..!
ఇంతకీ వైసీపీలోనే సొంత పార్టీ నేతలపై కుట్ర చేస్తోంది ఎవరు..? నియోజకవర్గంలో ఉన్న నేతలు నిఘా పెట్టి ఫోన్ ఆడియోలను బయటకు తీసుకొచ్చేంత సామర్థ్యం ఉండదు. ఉండేది పవర్ లో ఉన్న వారికే. అంటే పదవుల్లో ఉన్న వారికే . ప్రభుత్వం నిఘా పెట్టడానికి ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసుకుందనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఆ నిఘా ఇతర పార్టీల నేతలపైనే పెట్టాలన్న రూలేం లేదు. సొంత పార్టీ నేతలపైనా పెట్టి ఉండవచ్చన్న అనుమానం ఇప్పుడు వైసీపీ నేతల్లోనూ బలపడుతోంది. పెగాసస్ లాంటి సాఫ్ట్ వేర్ ఏదో .. తమ పార్టీ యాప్ ద్వారానో.. మరో ఏర్పాటు ద్వారానో చొప్పించి ఉంటారన్న అనుమానాలు వారిలో బలపడుతున్నాయి. అందుకే ఎవరికీ తెలియని రహస్యాలు చాలా లిమిటెడ్‌గా ఎంపిక చేసిన వారివి మాత్రమే బయటకు వస్తున్నాయని భయపడుతున్నారు.
తమపై ప్రభుత్వమే కుట్ర చేస్తోందని వణికిపోతున్న వైసీపీ నేతలు..!
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు హ్యాక్ కాకుండా తమ నేతల ఫోన్లనుకూడా కాపాడుకోలేవు. ఇతరుల ఫోన్లు హ్యాక్ చేసే అంత సీన్ ఉండదు. అంటే ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వానికి ఆ సామర్థ్యం ఉంది. అందుకే వైసీపీ నేతలు కూడా తమ ప్రభుత్వం వైపు కూడా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఒక వేళ అలా చేసినా.. తమ పరువు కాపాడటానికైనా రహస్యంగా పిలిచి వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కానీ ఇలా సోషల్ మీడియాకు లీక్ చేసి తమ పరువు బజారున పడేయడం ఎందుకనేది ఆయా నేతల ఆవేదన. కానీ అసలు ఈ స్పైయింగ్ లక్ష్యాలు వేరుగా ఉంటాయని వారికి తెలియదుగా..!?