‘మహానటి’ సావిత్రి షూటింగ్ పూర్తయ్యింది. ఎన్నో భావోద్వేగాల మధ్య.. చిత్రబృందంలోని సభ్యులు ఒకరికొకరు కన్నీటి వీడ్కోలు తీసుకున్నారు. సెట్లో ఆఖరి రోజు గుండెలు బరువెక్కాయి. సావిత్రిని తలచుకుంటూ… ఆమె చిత్రపటం ముందు నివాళి అర్పిస్తూ… ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు. అంతా బాగానే ఉంది. ఇప్పటికీ… అభిమానుల్ని తొలుస్తున్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. అదే.. ఈ సినిమాలో ‘ఎన్టీఆర్ ఎవరు?’
సావిత్రి కథలో.. ఎన్టీఆర్, ఏఎఎన్నార్ పాత్రలు చాలా కీలకం. ఏఎన్నార్ పాత్ర చేయడానికి నాగచైతన్య ముందుకొచ్చాడు. కాబట్టి సమస్య తీరిపోయింది. మరి ఎన్టీఆర్ పాత్ర ఎవరితో చేయించారు? ఆ పాత్రని మనవడు ఎన్టీఆర్ చేత చేయిస్తేనే న్యాయం జరుగుతుంది. మరి ఎన్టీఆర్‌తో షూటింగ్‌ని సైలెంట్ గా కానిచ్చేశారా?? లేదంటే మరో కొత్త నటుడ్ని ఎవరినైనా చూపిస్తున్నారా? లేదంటే నాని, శర్వాలలో ఒకరితో ఆయా సన్నివేశాల్ని పూర్తి చేశారా? ప్రస్తుతం ఇవే అనుమానాలు. సూరేకాంతం, భానుమతి పాత్రలు ఎవరితో చేయించారు? ఈ విషయాలూ తెలియాల్సివుంది. ఈ సీక్రెట్స్ ఒకొక్కటీ రివీల్ చేస్తూ… వాటిని ప్రమోషన్లలో వాడుకుంటారేమో చూడాలి.