అమరావతి రాజధాని అనేది బీజేపీ విధానం అని… రాజధాని రైతుల కోసం పోరాడుతామని.. భారతీయ జనతా పార్టీ నేతలు… వారి మిత్రపక్షం.. జనసేన చెబుతోంది. అయితే.. వారు ఎవరిపై పోరాడతారన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న మూడు రాజధానుల నిర్ణయంతో తమకు సంబంధం లేదని.. హైకోర్టు అడగకపోయినా.. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసేసింది. బీజేపీ రాష్ట్ర శాఖ విధానం కూడా అదే. అంటే.. బీజేపీ కేంద్ర శాఖ అయినా… రాష్ట్ర శాఖ అయినా పోరాడాల్సింది వైసీపీ సర్కార్ పైనే. మరి ఆ దిశగా ఇప్పటి వరకూ.. ఏదైనా ఒక్క ప్రకటన చేశారా అంటే … బూతద్దం పెట్టి వెదకాల్సిన పరిస్థితి.
రైతుల కోసం.., పోరాడతాం.. పోరాడతాం అంటారు.. ఎవరిపై పోరాడతారో మాత్రం చెప్పరు. రైతులకు అన్యాయం చేస్తోంది వైసీపీనే. వారికి న్యాయం జరగాలంటే.. గత ప్రభుత్వం చెప్పినట్లుగా అమరావతిని అక్కడ అభివృద్ధి చేయాలి. రాజధానిని అక్కడే ఉంచాలి. ప్రజా రాజధానిగా మార్చాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటం లేదు. అమరావతిని అక్కడ్నుంచి తరలించేసి విశాఖకు తీసుకుపోతున్నారు. తానీ బీజేపీ ఈ విషయంలో వైసీపీ ని ఒక్క సారంటే.. ఒక్క సారి కూడా విమర్శించిన దాఖలాలు లేవు. రైతులకు న్యాయం చేయాలంటే.. ఏం చేయాలో.. డిమాండ్లు వినిపించిన సందర్భం కూడా లేదు. కానీ.. అమరావతి రైతుల కోసం పోరాడతామంటూ.. భీకరమైన ప్రకటనలు చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీకి ఏపీలో బలం లేదు. అమరావతిని కాపాడటం.. ఆ పార్టీకి నిమిషంలో పని అని.. అక్కడి రైతులంతా నమ్ముతున్నారు. అందుకే.. నిన్నామొన్నటిదాకా చాలా సానుకూలంగా ఉన్నారు. కానీ… అసలు తమకే మాత్రం సంబంధం లేనట్లుగా.. వైసీపీ నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తూ.. వ్యవహరిస్తున్న తీరు.. వారిని ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇప్పుడు రాజకీయం చేసేందుకు.. అమరావతి రైతులకు అండగా ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. అంతగా కావాలని అనుకుంటే.. తమ విధానం.. మూడు రాజధానులు అని బీజేపీ ప్రకటించుకోవచ్చు కానీ.. ఈ మోసం చేసే రాజకీయాలు ఎందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ రైతుల కోసం పోరాటం చేయడమే కాదు.. న్యాయం చేయాలి. ఇప్పుడు బీజేపీ న్యాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉంది. కేంద్రం పరిధిలో లేదని.. అదని.. ఇదని చెబితే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. రాజధాని అమరావతిని కేంద్రం గెజిట్లో పెట్టింది… నిధులు కూడా ఇచ్చింది. అన్నీ మర్చిపోయి… ఇప్పుడు తమకు సంబంధం లేదంటే.. ప్రజలు నమ్మేయలేరు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి… రాజకీయం చేసుకుని… బలపడితే… ఆ పార్టీకి లాభం ఏమో కానీ.. రాష్ట్రమే.. సర్వనాశనం అవుతుంది. అయిపోతోంది కూడా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు.