మన నాయకుల రాజకీయ మంత్రాంగాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోమంటే జీవితాంతం అదే పనిలో ఉండగల సమర్థులు. కానీ చేతల్లో నిరూపించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయరు. అందరివీ బ్రతకనేర్చిన చావు తెలివితేటలే. హైదరాబాద్ నుంచి ఎవరో ఒక మహా అవినీతిపరుడు తన 10వేల కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నాడు. కనీసం ఈ పాటి సొమ్మయినా వైట్‌గా మార్చుకుని ఎంతొ కొంత ట్యాక్స్ కట్టిన ఆ అవినీతి సామ్రాట్టుని కూడా అభినందించాల్సిన దుస్థితిలో మనల్ని పడేశారు నాయకులు. బడా బడా రాబంధుల అవినీతి సొమ్ము రాబట్టడం అసాధ్యం అనే స్థాయికి మన ఆలోచనలను తీసుకెళ్ళారు చేతగాని మన పాలకులు.
ఆ విషయం పక్కన పెడితే ఆ పదివేల కోట్లు రామోజీరావుకి చెందినవి అని జగన్ మీడియా రాసేసింది. ఆ మహా అవినీతి సామ్రాట్టు రామోజీనే అని పరోక్షంగా చెప్పేసింది. కాస్త ఆలస్యంగానైనా రామోజీరావుకు సపోర్ట్‌గా చంద్రబాబు బయల్దేరారు. పదివేల కోట్ల అవినీతి సొమ్ము సంపాదించడం వ్యాపారస్తులకు సాధ్యం కాదు అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. పొద్దస్తమానం టెక్నాలజీ అని, తాను చాలా అడ్వాన్స్‌గా ఆలోచిస్తానని చెప్పుకునే చంద్రబాబు తనకు అవసరమైన విషయాల్లో మాత్రం క్రీస్తు పూర్వం కాలంలో ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు. పది వేల కోట్ల అక్రమ సంపాదన ఓ వ్యాపారస్తుడికి సాధ్యం కాదా? చంద్రబాబు తెలివితేటలు, ఆలోచనా సామర్ధ్యంపైనే అనుమానం వచ్చే మాటలు ఇవి. ఆ పదివేల కోట్లు రామోజీరావువి కాదు అని డైరెక్ట్‌గా చెప్పేసి ఉంటే బాగుండేది. ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడి తన అజ్ఙానాన్నే బయటపెట్టకున్నాడు చంద్రబాబు. రాజకీయ నాయకుల సపోర్ట్ ఉన్న వ్యాపారస్థుడికి లక్ష కోట్ల అక్రమార్జన కూడా సాధ్యమే అని ఆల్రెడీ నిరూపించిన వాళ్ళు మన దేశంలోనే కొంతమంది ఉన్నారు. ఈ రోజు ఉన్న వ్యాపారస్తుల్లో ఎక్కువ మంది అలాంటి వాళ్ళే. ఆ పదివేల కోట్లు రాజకీయ నాయకులవే అని చంద్రబాబు నోటి నుంచి ఆణిముత్యం లాంటి ఓ మాట జాలువారగానే దేవినేని ఉమ చంద్రబాబు మనసులోని మాటను క్యాచ్ చేశాడు. లేకపోతే ఎన్టీఆర్ భవన్లో చాలా యాక్టివ్‌గా 24/7 పనిచేస్తూ ఉండే మీడియా వింగ్ వాళ్ళే పక్కాగా ప్లాన్ చేశారేమో తెలియదు. చంద్రబాబు మాట్లాడిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన దేవినేని…ఆ పదివేల కోట్లు జగన్‌వే అని క్లారిటీ ఇచ్చేశాడు. అంతా కూడా ఓ ప్లాన్ ప్రకారం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.
ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలతో వైసిపి, టిడిపిలకు, కొంతమంది నాయకులకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కానీ సామాన్యులకు ఒరిగేదేమీ ఉండదు. ప్రస్తుతం చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కేంద్రప్రభుత్వంలో కూడా భాగస్వామి. జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం ఆ డబ్బును ఖర్చుపెడతానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పి ఉన్నాడు. ఆల్రెడీ సగం కాలం గడిచిపోయింది. మరి ఇంకా ఎందుకు ఆ పని చేయడం లేదు. అసలు మీడియా ముందు హీరోయిజం ఎందుకు? మాటలతో ఎందుకు కాలక్షేపం చేస్తున్నారు? టిడిపి నాయకులు, టిడిపి మీడియా చెప్తున్న లక్ష కోట్లు, లేకపోతే వేల కోట్ల అక్రమ సొమ్ము జగన్ దగ్గర ఉన్నట్లయితే ఆ సొమ్మును ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు. జగన్‌ని ఎందుకు జైలుకు పంపించడం లేదు. అవినీతి పరుల గురించి మీడియాతో మాట్లాడుతూ ఉంటే ప్రజలకు ఒరిగేది ఏం ఉంటుంది? ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా… ఆ డబ్బులను స్వాధీనం చేసుకుని, నేరస్తులను జైలుకు పంపితే అప్పుడు చంద్రబాబు గొప్పతనం తెలుస్తుంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్‌కి కూడా కేవలం మాటలతో కాలక్షేపం చేయాల్సిన అవసరం లేదు. తనకు అవసరమైన విషయాల కోసం ఇప్పటికే చాలా సార్లు కోర్టు మెట్లెక్కి ఉన్నాడు జగన్. మరి ఈ పదివేల కోట్ల విషయంపైన కూడా ఎందుకు న్యాయపోరాటం చేయడం లేదు. చీకట్లో రాళ్ళు విసిరే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడు? చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ కూడా… మా అంత తోపు లేడని చెప్తుకుంటూ ఉంటారు. మేమే గొప్పోళ్ళం, మాదే పౌరుషం, మమ్మల్ని మించినోడు లేడు. మా వీరత్వానికి ఎవరూ సాటి రారు అని మంగళవారం కబుర్లు చెప్తూ ఉంటారు. ఇలా మాటలతో కాలక్షేఫం చేయడమేనా వీరత్వం అంటే. అంతటి వీరులే అయితే తప్పులు చేస్తున్న ప్రత్యర్థిని ఎందుకు దెబ్బకొట్టలేకపోతున్నారు? ప్రజలను మాయ చేయడానికి కాకపోతే ఈ మాటల యుద్ధాలు ఎందుకు?