ఇది వరకు చారిత్రక నేపథ్యంలో సినిమా అంటే.. ‘కమర్షియల్‌గా వర్కవుట్ కాదులే’ అనుకొనేవారేమో. గౌతమిపుత్ర శాతకర్ణితో ఆ లెక్కలు మారిపోయాయి. ఆ తరహా కథలూ.. బాక్సాఫీసు దగ్గర గొప్ప విజయాల్ని అందుకొంటాయని, మైళ్లు రాళ్లుగా నిలిచిపోతాయని చాటి చెప్పిన సినిమా అది. గౌతమి పుత్ర ఇచ్చిన ప్రోత్సాహంతోనో ఏమో… ఇప్పుడు మరోసారి ఆయన దృష్టి చారిత్రక కథపై మళ్లింది. శ్రీ కృష్ణదేవరాయులు కథని వెండితెరపై చూసుకోవాలని ఆయనకు మక్కువగా ఉందట. ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం ఉన్న మూడ్‌ని బట్టి చూస్తే… ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించడం, కమర్షియల్‌గా వర్కవుట్ చేసుకోవడం అంత కష్టమైన విషయం ఏమీ కాదు. క్రిష్ స్టామినా, టెక్నికల్‌గా అతని బలం… గౌతమిపుత్రతో సినీ జనాలకు బాగా తెలిసింది. దాంతో.. ఆయన ఏ హీరో దగ్గరకు వెళ్లినా కథ ఓకే అయిపోతుంది. అయితే.. దేవరాయులుగారిగా క్రిష్ ఎవరిని చూపిస్తాడన్నది సందేహంగా మారింది.
ఆ పాత్రకు నందమూరి బాలకృష్ణ తప్ప ఎవ్వరూ నప్పరన్నది నిర్వివాద అంశం. ఆదిత్య 369లో కాసేపు దేవరాయులుగా కనిపించి మెప్పించాడు బాలయ్య. ఆయనకూ పూర్తి స్థాయిలో ఆ పాత్ర పోషించాలని వుంది. కానీ.. ఇప్పటి వరకూ అలాంటి కథని మోసే దర్శకుడు దొరకలేదు. క్రిష్‌తో బాలయ్య అన్వేషణ ఫలించొచ్చు. అయితే.. మళ్లీ అంత త్వరగా బాలయ్య – క్నిష్ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా అనేదే సందేహం. ఎందుకంటే ఎప్పుడూ ఒకే కాంపౌండ్‌లో స్ట్రక్ అయిపోవడం క్రిష్ కి నచ్చదు. బాలయ్యకూ చేతిలో వరుసగా సినిమాలున్నాయి. కాబట్టి బాలయ్య కోసం క్రిష్ ఇంకొంత కాలం ఆగాల్సిందే. గౌతమబుద్ద కథనీ తెరకెక్కించాలన్నది క్రిష్ ప్లాన్. ఈ లోగా ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కించుకోవడం మేలేమో..!