భారత ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడును ప్రకటించడంతో ఏపీ పార్టీ వర్గాల్లో ఈ ఆలోచన మొదలైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీని తన భుజస్కంధాలపై మోశారాయన. అన్నీ తానై.. అంతా తానై వ్యవహరించారు. 1978లో ఏపీ అసెంబ్లీకి చంద్రగిరి నుంచి ఎన్నికైన వెంకయ్య, అనంతరం ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. తదుపరి ఆయన నేరుగా ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. రాజ్యసభకు నాలుగుసార్లు ఎన్నికైన ఘనత ఆయన సొంతం. ప్రాసతో కూడిన సంభాషణలు, వాక్చాతుర్యం ఆయనకు అదనపు అర్హతలు. నాలుగు భాషల్లో అనర్గళంగా ప్రసంగించగలరు. ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో దిట్ట. పత్రికలతో మాట్లాడేటప్పుడు శీర్షికతో సహా ఇస్తూ ఆయన ప్రసంగిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలను నెరుపుతూ ఏపీకి కావలసిన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ఆ అవసరాలను తీరుస్తూ వస్తున్నారు వెంకయ్యనాయుడు. 1999 నుంచి ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో రాష్ట్రానికి నిధులు రావడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. కేంద్రంలో సైతం వెంకయ్య ఏపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాలను అత్యంత చాకచక్యంగా పరిష్కరిస్తూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ మెరుగుదలను సైతం విస్మరించి పనిచేశారు. అంతటి కృషి చేసిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కానుండటం ఏపీ ప్రజలకు నిజంగా తీపి కబురే. రాజ్యాంగపరంగా తనకు సంక్రమించే అధికారాలను సైతం వెంకయ్యనాయుడు ఏపీ అభివృద్ధికి ఉపయోగిస్తారని అనుకుంటున్నారు. ఇక పార్టీకి మాత్రం వెంకయ్య సేవలు అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగించేవే. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన నేరుగా ఏపీ పార్టీ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేరు. ఇప్పుడు ఆ స్థాయి నేత ఆంధ్రకు అత్యవసరం. ఎంతో అనుభవమున్న వెంకయ్యను గుర్తించి, దేశ రెండో పౌరుని హోదాను కల్పిస్తున్న బీజేపీ అధిష్టానానికి అదే చేత్తో ఓ మంచి నేతను గుర్తించి, ఏపీకి అప్పగించడం పెద్ద కష్టం కాబోదు. అందుకు కొంత కాలం వేచి ఉండక తప్పదు.
వెంకయ్యతో నా అనుభవం…
అది.. 1986 జూన్ మాసమనుకుంటా. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవాడలో ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో నేను జనతా అనే స్థానిక సాయంకాల పత్రికకు రిపోర్టర్‌గా పనిచేస్తున్నాను. దానికి ఎడిటర్ మొవ్వా రామమోహనరావు గారు. సమావేశాలకు హాజరవుతున్న అగ్రనేతలలో అతల్ బిహారీ వాజపేయి గారి ఇంటర్వ్యూ సంపాదించగలవా అని అడిగారు. అదెంత కష్టమో నాకు తెలీదు. అప్పుడే వృత్తిలో ప్రవేశించినవాడిని.. పరిచయాలు అంతకంటే లేనివాడిని.. ఉత్సాహంగా `ఊ` అన్నాను. ఆ తరవాత ఎలా అన్నదే సమస్య. అప్పుడే వెంకయ్యనాయుడిగారిని కలిశాను. సమావేశాల వివరాలను తెలపడానికి ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో ఆయనతో మాట్లాడాను. నీ పేరేంటమ్మా అంటూ పలకరించిన ఆయన నా కోరిక తెలుసుకుని అంగీకరించారు. బహిరంగ సభ జరిగే రోజు సాయంత్రం సభకు ముందు పది నిముషాలు ఆయనతో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తానన్నారు. అన్నట్లే.. ఆయన ఆ పని చేశారు. మరుసటి రోజు జనతా పత్రికలో వచ్చిన వాజపేయి ఇంటర్వ్యూ చూసి, పెద్ద పత్రికల వారు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందరూ ఎల్.కె. అద్వానీ గారి ఇంటర్వ్యూ తీసుకున్నారు.
కొత్తవారితో సైతం వెంకయ్య నాయుడు ఆత్మీయంగా మెలగుతారనీ, పనులు చేసి పెడతారనీ చెప్పడానికి ఈ ఉదంతమే సాక్ష్యం.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి